
రెండురోజుల పాటు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులకు సరైన సమాధానాలు లభించలేదని తెలుస్తోంది. దీంతో అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. రెండు రోజుల కస్టడీ ముగియడంతో ఆయనను తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అయితే కస్టడీ విచారణలో పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. ముఖ్యంగా మాయమైన సెల్‌ఫోన్ గురించే పోలీసులు ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. సెల్‌ఫోన్ ఎక్కడ ఉంది? దాన్ని ఎందుకు దాచారు? అందులో ఉన్న చాట్స్, కాల్ డేటా, ఇతర డిజిటల్ ఆధారాల సంగతేంటి? అనే ప్రశ్నలను అధికారులు అడిగినట్లు సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. గుర్తులేదు, మర్చిపోయానంటూ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో సూసైడ్ నోట్ అంశంపైనా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. సూసైడ్ నోట్ ఎప్పుడు రాశారు? దాని వెనుక కారణమేంటి? దానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలు ఎక్కడున్నాయనే అంశాలపై అధికారులు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపైనా ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో సమాధానాలు రాలేదని తెలుస్తోంది.
ఈ కేసులో సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో జులై 18న కేసు నమోదైంది. 2023లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తనను తరచూ వేధించడంతో పాటు ఆధిపత్య ధోరణితో వ్యవహరించాడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించారు. తాను మరో వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కూడా వేధింపులు కొనసాగించాడని, ప్రైవేట్ చాట్స్‌ను లీక్ చేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో ప్రస్తావించారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి జులై 28న ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి స్పష్టత రాకపోవడంతో.. అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..