Hyderabad crime news: అతివేగం కారణంగా రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అరగంటలో గమ్యస్థానాలకు చేరుకోవల్సిన ఆ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ములుగుంపల్లికి చెందిన ఎన్ సత్యనారాయణ కొన్నాళ్ల క్రితం మృతి చెందారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. వారిలో చిన్న కుమార్తె కల్యాణి (22) హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో నివాసం ఉంటూ పంజాగుట్టలో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రాజేష్‌కుమార్ (26) కూడా ఎస్‌ఆర్‌నగర్‌లోనే నివాసం ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే కాలనీలో ఉంటున్న వీరిద్దరికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. శనివారం సరదాగా కారును అద్దెకు తీసుకుని లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు.
ఈ క్రమంలో తిరిగి ఇంటికి వెళ్తుండగా శనివారం రాత్రి మార్గమధ్యలో మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ పాతరోడ్డు వద్ద కారు వేగంగా వెళ్తూ అదుపుతప్పి రహదారి డివైడర్‌ను ఢీకొట్టుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కారు ముందు భాగం పూర్తిగా బస్సు కిందకు ఇరుక్కుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న రాజేష్‌కుమార్, కల్యాణి అక్కడికక్కడే మృతి చెందారు. వారి మృతదేహాలు సైతం నుజ్జయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో బస్సు కింద ఇరుక్కుపోయిన కారును బయటకు లాగారు. అనంతరం కారులోని మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. విచారణలో అతివేగం కారణంగా ప్రమాదం జరిగినట్లు ఇన్‌స్పెక్టర్ డీకే లక్ష్మీరెడ్డి మీడియాకు తెలిపారు.