Telangana: జీహెచ్‌ఎంసీ పరిధిలో రేపు, ఎల్లుండి సెలవులు.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం..

|

Jul 20, 2023 | 9:56 PM

Hyderabad News: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది.

Telangana: జీహెచ్‌ఎంసీ పరిధిలో రేపు, ఎల్లుండి సెలవులు.. సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం..
CM KCR
Follow us on

హైదరాబాద్, జూలై 20: నింగి నుంచి ఆగని వానలు.. నేలపై కదలని వాహనాలు.. మధ్యలో తడుస్తున్న జంట నగరవాసులు. రోడ్లపై తడిసి ముద్దైన జనాలు. యస్‌..!వరుణుడు హైదరాబాద్‌ను వీడనంటున్నాడు. గ్యాప్‌ లేకుండా కుమ్మేస్తున్నాడు. నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు మినీ చెరువులను తలపిస్తున్నాయి. మరో 48 గంటల పాటు ఇదే తరహాలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. శుక్ర, శనివారం రెండు రోజులపాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు రెండు రోజులపాటు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశించారు.  భారీ వర్షాల కారణంగా శనివారం వరకు సెలవులు పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం.

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు ఇప్పటికే సెలవులు ప్రకటించగా.. ఎల్లుండి శనివారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఎడతెరపిలేకుండా వర్షాల కారణంగా రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో నగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. దీంతో సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికశాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు.