
“చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది.. డ్రాయింగ్ రూమ్‌లో ల్యాప్‌టాప్ ఉంది.. తలుపులేసుకుని బ్రౌజ్ చేస్తే ఎవడొచ్చి ఏం చేస్తాడు?” అనే అతి తెలివి ప్రదర్శిస్తున్నారా? అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి..! మీ ఫోన్ స్క్రీన్ మీద మీ కళ్ళు మాత్రమే లేవు, సైబర్ పోలీసుల డేగ కళ్లు కూడా ఉన్నాయి! యస్..! పిల్లల అశ్లీల వీడియోలను చూసినా, షేర్ చేసినా ఇకపై తాట తీస్తామని హెచ్చరిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించారు పోలీసులు.
పిల్లల అశ్లీల వీడియోలు చూసే వారిపై సైబర్ సెక్యూరిటీ ఉక్కుపాదం మోపడంతోపాటు.. తెలంగాణ వ్యాప్తంగా 24 మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా నాలుగేళ్ల చిన్నారిని పోలీసులు కాపాడినట్లు పేర్కొన్నారు. 18 టీమ్స్‌తో సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ నిర్వహించగా.. నిందితులంతా మిడిల్ క్లాస్, వర్కింగ్ ఉద్యోగులే ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వీరిలో గతంలోనూ ఇదే తరహా నేరాలు చేసి పోలీసులకు చిక్కిన పాత నేరస్తులు కూడా ఉన్నారు. గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే, పిల్లల అశ్లీల వీడియోలు షేరింగ్, వాచింగ్ ఏకంగా 90 శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు.
>>తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు చూసిన నిందితుల సంఖ్య పదింతలు పెరిగింది.
>>2025లో పిల్లల అశ్లీల వీడియోలు చూసి షేర్ చేసిన వారిపై 875 కేసులు నమోదయ్యాయి.
>>2024లో 37 మంది అరెస్టయ్యారు. మరుసటి ఏడాదిలో ఏకంగా 423 మందిని అరెస్ట్ అయ్యారు.
>>టీనేజర్లే కాదు, 20 ఏళ్లు దాటిన ప్రైవేటు ఉద్యోగులు కూడా ఈ నేరాల్లో ఈజీగా చిక్కుకుంటున్నారు.
చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలపై ప్రపంచవ్యాప్తంగా దీనిపై నిషేధం ఉంది. అమెరికా ఐతే పోర్న్ కంటెంట్‌కు చెక్ పెట్టడం కోసం NCMEC పేరుతో ఒక యంత్రాంగాన్నే ఏర్పాటు చేసింది. ఇండియాలోని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో ఒప్పందం చేసుకుంది. తప్పిపోయిన చిన్నారుల్ని వెతికిపట్టడమే కాదు, అటువంటి అనాథ చిన్నారులతో పోర్న్ బిజినెస్ చేసేవాళ్ల ఆట కట్టిస్తుంది NCRB. ఇందుకోసం పకడ్బందీగా ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ కూడా ఏర్పాటైంది.
‘సైబర్ టిప్‌లైన్’… చిన్నారుల అశ్లీల ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేసినా, బ్రౌజ్ చేసినా ఆన్‌లైన్‌లో అలర్ట్స్ వచ్చే పక్కా వ్యవస్థ ఇది. సైబర్ టిప్‌లైన్ రాగానే IP అడ్రస్‌లను గుర్తించి దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేస్తుంది. ఇంటర్నెట్‌తో లింకైన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా దేన్నయినా సరే ట్రాక్ చేస్తారు.
ఇలా సేకరించిన డేటాను ఆయా దేశాల విదేశాంగ శాఖ, హోంశాఖ, రాష్ట్రాల సీఐడీలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరోలకు ఫార్వర్డ్ చేస్తారు. సో, అమలాపురంలో చూసినా అమెరికాలో ఇట్టే పసిగట్టేస్తారు. ఆనక మన పోలీసులే ఇంటికొచ్చి బేడీలేసి లోపలేస్తారు. చిన్నారులకు సంబంధించి అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసినా, చూసినా, అప్‌లోడ్ చేసినా వెంటనే బుక్కయిపోగలరు జాగ్రత్త.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..