ఎడతెగని వర్షం హైదరాబాద్‌ను హడలెత్తిస్తోంది. ఇవాళ రాత్రికి మరోసారి వరుణుడు ప్రతాపం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో హై అలర్ట్ సాగుతోంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. రాత్రి నుంచి వదలకుండా వాన పడుతూనే ఉండగా.. నగరప్రజలు భయం గుప్పిట్లో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రాత్రికి దాదాపు 5 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడురోజులుగా గ్రేటర్ హైదరాబాద్‌ను వర్షం వదలడం లేదు. దీంతో చాలా లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. రోడ్లపై ట్రాఫిక్ నరకం చూపుతోంది.
అటు జంట జలాశయాల్లోనూ వరద కొనసాగుతూనే ఉంది. మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర ప్రమాదకరంగా వరద పారుతోంది. ఇప్పటికే బ్రిడ్జిని ఆనుకుని మూసీ వరద ప్రవహిస్తోంది. హియాయత్‌సాగర్, నుంచి పెద్ద ఎత్తున వరద వస్తోంది. భారీ వర్షానికి నాగోల్ డివిజన్‌లోని పలు కాలనీలోని ఇళ్లకు వర్షపు నీరు వచ్చి చేరింది. సారగ్ రింగురోడ్డులో భారీగా వరద ప్రవహిస్తుండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మూసారాంబాద్ బ్రిడ్జి దగ్గర వరద ప్రవాహాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి 52 కోట్లు కేటాయించామని, వరదలు తగ్గిన తర్వాత నిర్మాణం చేపబడతామన్నారు. చాదర్‌ఘాట్ దగ్గర మూసీ నది ఉధృతిని పరిశీలించి, అక్కడ సహాయక చర్యలపై సమీక్షించారు. తర్వాత నిండుకుండలా మారిన హుస్సేన్‌సాగర్ వరదను పరిశీలించారు.
భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఉస్మాన్‌సాగర్, హియాయత్‌సాగర్ నుంచి మూసీలోకి వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో ఆధారంగా ఔట్‌ఫ్లోను మెయింటేన్ చేస్తున్నారు అధికారులు. విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి జలాశయాల్లోకి భారీగా వరద వస్తోంది. భారీ వర్షాలతో ముంపు సమస్యతో పాటు విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. తడి చేతులతో స్విచ్‌లు, ఇతర విద్యుత్ పరికరాలను తాకొద్దు. అప్రమత్తతతో లేకుంటే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు అవసరం.