రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ భూవివాదం కేసులో ఊహించిందే జరిగింది. ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అరెస్టు చేసింది. బంజారాహిల్స్ భూవివాదంలో లంచం ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఖాలీద్ అనే వ్యక్తి నుంచి ఆమె లంచం తీసుకున్నట్లు ఆధారాలు దొరకడంతో సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు ఆమెను అరెస్టు చేసి.. మెడికల్ టెస్టుల కోసం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు.
బంజారాహిల్స్‌లో రూ.50 కోట్ల విలువైన ల్యాండ్ వ్యవహారం కలకలం రేపింది. భూ వివాదాన్ని సాల్వ్ చేస్తానంటూ ఖాలీద్ అనే వ్యక్తి నుంచి ఆర్‌ఐ నాగార్జునరెడ్డి రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో గుట్టు రట్టైంది. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఆర్‌ఐ అడ్డంగా బుక్కయ్యాడు. ఇదే వ్యవహారంలో కేసు మాఫీ చేస్తానంటూ రూ.3 లక్షలు డిమాండ్ చేసి ఎస్‌ఐ రవీంద్రనాయక్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇంత భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం వెనుక ఉన్నతాధికారుల హస్తం ఉందా? అనే అంశంపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో షేక్‌పేట్ ఎమ్మార్వో సుజాతను వరుసగా మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఆమె ఇంట్లో తనిఖీ చేయగా.. రూ.30 లక్షల నగదు, బంగారు ఆభరణాలు దొరికాయి. అవి ఎక్కడనుంచి వచ్చయనే విషయంపై ఎమ్మార్వో సరైన ఆధారాలు చూపకపోవడంతో..ఈ కేసు వ్యవహారంలో ఆమె పాత్రను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.