సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. వాహనాల పార్కింగ్ ఫీజు పెంపు! కొత్త ధరలు ఇవే

నిత్యం ప్రయాణికుల రాకపోకలతో రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ లో పునరాభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. ఇందులో భాగంగా ప్రయాణికులకు రైల్వే అధికారులు కీలక సూచనలు జారీ చేశారు..

సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. వాహనాల పార్కింగ్ ఫీజు పెంపు! కొత్త ధరలు ఇవే
Parking Fee At Secunderabad Railway Station

Updated on: Jan 22, 2026 | 4:30 PM

హైదరాబాద్‌, జనవరి 22: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడం, స్టేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం గత కొన్ని నెలలుగా అక్కడ నిర్మణ పనులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.714.73 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి పనులు చేస్తున్నారు. రైల్వే ప్రయాణికులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించడంతో పాటు, స్టేషన్ ప్రాంగణంలో భద్రత, క్రమశిక్షణను పాటిస్తూ పనులు యుద్ధప్రాతిపదికన దశలవారీగా కొనసాగుతున్నాయి. ఇటీవల పండుగ రద్దీ ఉన్నప్పటికీ రైలు సేవలకు గానీ, ప్రయాణికులకు గానీ ఎలాంటి అంతరాయం కలగకుండా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. పునరాభివృద్ధి కార్యకలాపాలలో భాగంగా, స్టేషన్ ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, వాహనాల రాకపోకలను సజావుగా సాగించడానికి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, తక్కువ సమయంలో వాహన రాకపోకలను ( పికప్, డ్రాప్) మాత్రమే అనుమతిస్తున్నారు.

మొత్తం పార్కింగ్‌ను ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 వైపు మళ్లించారు. అనధికార పార్కింగ్, వాహనాల అడ్డంకులను నివారించడానికి యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. ఈ జోన్‌లోకి ప్రవేశించే ప్రయాణీకులకు 15 నిమిషాల వరకు ఉచిత పికప్, డ్రాప్ సౌకర్యం అధికారులు కల్పించారు. ఆ తర్వాత అధీకృత పార్కింగ్ స్థలంలో పార్క్ చేయని వాహనాలపై అదనపు రుసుములు విధిస్తున్నారు. పునరాభివృద్ధి దశలో నిరంతరాయ ట్రాఫిక్ ప్రవాహాన్ని కొనసాగించడానికి, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఈ చర్యలు చేపట్టారు. అయితే రైళ్లు ఎక్కడానికి, అలాగే ప్రయాణికుల రాకపోకలకోసం, పార్కింగ్ ప్రయోజనాల కోసం ప్లాట్‌ఫామ్ నెం. 10 వైపున ఉన్న బేస్‌మెంట్‌లో ఫోర్‌ వీలర్‌, టూ వీటర్‌ వాహనాలకు తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ప్రయాణీకులకు మార్గనిర్దేశం చేయడంలో భాగంగా స్టేషన్‌లోని ముఖ్యమైన ప్రదేశాలలో స్పష్టమైన దిశానిర్దేశక సంకేతాలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ద్వారా సందేశాలు, ప్రదర్శన బోర్డులు సైతం ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ ఫీజులు ఇలా..

  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నం.10 బేస్‌మెంట్‌లో ఉన్న పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చార్జీలు తాజాగా జారీ చేశారు.
  • ఫోర్‌ వీలర్‌ పార్కింగ్‌ మొదటి రెండు గంటలు లేదా అంతకు లోపల రూ. 40/- చెల్లించాలి. ఆ తదుపరి గంటకు రూ. 20/- చొప్పున చెల్లించాలి.
  • మోటార్ సైకిల్/స్కూటర్/ టూ వీలర్‌ వాహనాలకు మొదటి రెండు గంటలు లేదా అంతకు లోపల రూ. 25 చొప్పున చెల్లించాలి. తదుపరి గంట లేదా దానికి లోపల రూ. 10 చొప్పున చెల్లించాలి.
  • బై- సైకిల్‌కు మొదటి రెండు గంటలు లేదా అంతకు లోపల రూ. 5 చెల్లించాలి. తదుపరి గంట లేదా దానికి లోపల రూ. 2 చొప్పున చెల్లించాలి.

పార్కింగ్ ప్రాంతంలోని ప్రముఖ ప్రదేశాలలో కూడా టారిఫ్ చెల్లించాలి. ప్రస్తుతం, 50 శాతం పునరాభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. మొత్తం ప్రాజెక్టును డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పునరాభివృద్ధి చెందిన స్టేషన్‌లో ప్రయాణీకులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు, సదుపాయాలు కల్పించనున్నారు. ఈ సౌకర్యాలలో ప్లాట్‌ఫామ్ నంబర్ 1 వైపు మల్టీలెవెల్ కార్ పార్కింగ్ సౌకర్యం, ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు బేస్‌మెంట్ పార్కింగ్, పార్కింగ్ సామర్థ్యాన్ని పెంచడం, వాహనాల కదలికను క్రమబద్ధీకరించడం, స్టేషన్‌లో ప్రయాణీకులకు, సందర్శకులకు మెరుగైన సౌకర్యాన్ని ఏర్పాటుచేయడం వంటివి ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనుల దృష్ట్యా అనధికార పార్కింగ్ వలన విధించే ఓవర్-స్టే ఛార్జీలను నివారించడానికి ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు వాహనాలను మళ్లించి బేస్‌మెంట్ పార్కింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ప్యాసింజర్లకు దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.