మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సేఫేనా..? వామ్మో మరో ప్రాణం బలి.. బంతిని తీసేందుకు వెళ్లి..

మీ లిఫ్ట్‌ సేఫేనా? అది కొత్తదా? పాతదా? అన్నది కాదు.. లిఫ్టులు డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌వాసులు ఆదమరిచి అడుగేస్తే ఇక యమలోకానికే. డెడ్లీ లిఫ్టులు.. పిల్లల ప్రాణాలు సైతం బలిగొంటున్నాయి. లిఫ్ట్‌ ప్రమాదాలు ఇటీవల మితిమీరిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది. కుత్బుల్లాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ మీద పడి అక్బర్ పాటిల్ అనే వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు.

మీ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ సేఫేనా..? వామ్మో మరో ప్రాణం బలి.. బంతిని తీసేందుకు వెళ్లి..
Lift Mishap In Medchal

Updated on: Apr 14, 2025 | 10:02 AM

బటన్‌ నొక్కాం.. లిఫ్ట్‌ తలుపులు తెరుచుకున్నాయి. కళ్లుమూసుకుని పరధ్యానంగా లోపలికి అడుగేశారో.. అంతే సంగతులు. ఆడుకుంటూ లిఫ్ట్‌ ఎక్కే పసిపిల్లలకే కాదు.. వెనుకాముందు చూసుకునే పెద్దోళ్లపాలిట కూడా యమదూతల్లా మారుతున్నాయి కొన్ని లిఫ్ట్‌లు. ఇటీవల కాలంలో లిఫ్టులు పిల్లలే కాదు.. పెద్దల ప్రాణాలు బలిగొంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌లో మరో లిఫ్ట్‌ ప్రమాదం జరిగింది. కుత్బుల్లాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ మీద పడి అక్బర్ పాటిల్ అనే వ్యక్తి స్పాట్‌లోనే చనిపోయాడు. లిఫ్ట్ గోతిలో పిల్లలు ఆడుకునే బంతి పడిపోయింది. బంతిని బయటకు తీసే క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్‌ ఆర్ఎంపీ అక్బర్‌పై పడింది. తలపై పడటంతో అక్బర్‌ అక్కడికక్కడే చనిపోయాడు.

ఎన్నో ప్రమాదాలు..

ఈ నెల 7న హైదరాబాద్ ఆసిఫ్‌ నగర్‌లో లిఫ్ట్ ప్రమాదానికి గురైంది. అపార్ట్‌మెంట్‌లో ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది లిఫ్ట్ .ప్రమాద సమయంలో లిఫ్ట్‌లో మొత్తం ఆరుగురు ఉండగా.. అందులో ముగ్గురు చిన్నారులు. గాయపడ్డ ముగ్గురిని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు.

మార్చి నెలలో 15 రోజుల్లో మూడు ఘటనల్లో ముగ్గురు చనిపోయారు. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో వాచ్‌మెన్‌ కుమారుడు సురేందర్‌.. ఆడుకుంటూ వెళ్లి.. ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. నాంపల్లిలోనూ ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయాడు బాలుడు అర్ణవ్‌. లిఫ్ట్‌కి స్లాబ్‌ గోడకి మధ్య ఇరుక్కుని ఇంటర్నల్‌ బ్లీడింగ్‌తో చనిపోయాడు. సిరిసిల్లలో పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ గంగారాం లిఫ్ట్‌ ఎక్కే ప్రయత్నంలో కిందపడి చనిపోయారు. లిఫ్ట్‌ వచ్చిందనుకుని డోర్‌ ఓపెన్‌ చేసిన గంగారాం.. అందులో పడిపోయి తీవ్ర గాయాలతో మరణించారు.

మార్చి 21న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లిఫ్ట్ జారి పడి సరోజనమ్మ అనే పేషెంట్ ప్రాణాలు కోల్పోయింది. గుండె సంబంధిత చికిత్స కోసం లిఫ్ట్‌లో తీసుకొని వెళ్తుండగా ఒక్కసారిగా కిందపడింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

తెలంగాణలో ప్రస్తుతం వినియోగంలో ఉన్న లిఫ్ట్‌లు సేఫేనా అంటే కాదంటోంది ఎలివేటర్స్‌ అండ్‌ ఎస్కలేటర్స్‌ అసోసియేషన్‌. తెలంగాణలో ఏటా 10వేలకు పైగా లిఫ్ట్‌ల విక్రయాలు జరుగుతుంటే.. అందులో 20శాతం మాత్రమే సేఫ్‌ అంటోంది. 80శాతం లిఫ్ట్‌లు నాణ్యత లేనివే అని చెబుతోంది. మరోవైపు లిఫ్ట్ ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..