
రేవంత్ కన్నుపడితే ఆ భూమిలో కబ్జా బోర్డు పాతాల్సిందే ! అది పెద్దల భూమినా..? పేదల భూమినా..? అన్న తేడా ఉండదు. కన్నుపడిందంటే ఖతం కావాల్సిందే ! ఖాళీ స్థలం కన్పిస్తే కబ్జా గ్యాంగ్ అక్కడ వాలిపోతుంది. గోపన్‌పల్లి, గంధంగూడలో సరిగ్గా ఇదే జరిగింది. దళితులను భయపెట్టి కోట్లాది రూపాయల విలువ చేసే భూమిని బలవంతంగా లాక్కున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి అతని సోదరుడు కొండల్‌రెడ్డి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారుల ప్రాథమిక దర్యాప్తులో రేవంతుడి అక్రమాలు తేటతెల్లమయ్యాయి.రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి సర్వే నం.127లో భూదందాకు తెరలేపారు. ఈ వ్యవహారంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో ఆ సర్వే నంబరు వివాదాల సుడిగుండంగా తేలింది. ఆ తీగ లాగితే రేవంత్ అవినీతి డొంక కదిలింది. అప్పటి అధికారులు ఆర్వోఆర్ చట్టాలను, నియమాలను తుంగలో తొక్కి రికార్డుల్లో కొనుగోలు చేసి వారి పేర్లను మార్చినట్లు స్పష్టమైంది.
ఈ వ్యవహారంలో రేవంత్‌కు సహకరించినట్లు అభియోగాలు రావడంతో రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి సస్పెన్షన్ వేటు కూడా పడింది. రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి ఓ నివేదిక కూడా అందజేశారు. అయితే ఈ భూ వివాదంపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొన్ని కేసులు ఇప్పటికే హైకోర్టు, జిల్లా కోర్టు, రెవెన్యూ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ భూదందాపై ప్రభుత్వం, ప్రైవేట్, వాల్టా చట్టం కింద వివిధ కేసులతో పాటు క్రిమినల్ కేసులను రేవంత్, అతని సోదరుడిపై నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ భూములే కాదు ప్రభుత్వ భూముల్ని రేవంత్ బ్రదర్స్ వదల్లేదు. గంధంగూడలో 3.22 ఎకరాల ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసినట్లు తేలింది.
అయినా ఇలాంటి భూదందాలు రేవంత్‌కు కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి. రేవంత్ కోట్లకు పడగలెత్తడానికి కారణం కూడా భూకబ్జాలు సెటిల్‌మెంట్‌లే ! అందుకే అనతి కాలంలోనే కోట్లకు కోట్లు వెనకేశారు. రేవంత్ పేరు చెప్పగానే ముందు ఓటుకు నోటు కేసు గుర్తొస్తుంది. దాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ కేసులో ప్రధాన నిందితుడు రేవంత్. ఐదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు ఇది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ కేసులో అరెస్టైన రేవంత్ కొన్ని రోజులు జైల్లో కూడా ఉన్నారు. ఇప్పటికీ ఆ కేసులో ఏసీబీ కోర్టుకు హాజరవుతునే ఉన్నారు.
నిజంగా భూకబ్జాలు ఆరోపణలే అయితే రేవంత్ ఈపాటికీ నిరూపించి ఉండాలి. ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయారో… ఇప్పుడు అలానే అడ్డంగా దొరికిపోయారు. అక్రమాల బండారం బయట పడితే ఎదుటివారి బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎక్కడ అవినీతి గుట్టు బయటపడుతుందోనని అక్కర లేని డ్రామాలు ఆడారు. చివరకు డ్రోన్ కెమెరాతో రహస్యంగా ఫాంహౌజ్‌లో దృశ్యాలు చిత్రీకరించిన కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. గోపన్‌పల్లి భూకబ్జా కేసు నుంచి బయటపడేందుకు కొత్త డ్రామాకు తెరలేపారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి పాపం పండినట్లే కన్పిస్తోంది. అతని అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటకొస్తోంది.