ప్లవ నామ సంవత్సరం పోతూ పోతూ.. శుభకృత్ నామ సంవత్సరానికి సవాల్ విసిరింది. ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్(Pragati bhavan) మధ్య విబేధాలున్నట్టు సంకేతాలనిస్తోంది. లాస్టియర్ క్లైమ్యాక్స్.. రాబోతున్న కొత్త సంవత్సరానికిస్తోన్న సందేశమేంటి? అసలా సంకేతాల వివరాలు ఎలాంటివి? గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) రాజ్ భవన్ ఉగాది వేడుకల్లో(Rajbhavan Ugadi Celebrations) వినిపించిన ఆవేదనా పూర్వక స్వరం ఏమని చెబుతోంది? రాజ్ భవన్– ప్రగతి భవన్ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ముసలం పడింది. దీంతో ప్రగతి భవన్ పంచాంగ శ్రవణానికి గవర్నర్‌కు ఇన్విటేషన్ అందలేదు. ఇక్కడే మొదలైంది ఉగాది పంచంగ ఫలితాల ప్రభావం. రాజపూజ్య అవమానాలు ఇక్కడే తెలిసిపోతున్నాయిగా అంటున్నారు రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు. ప్లవ నామ సంవత్సరం వెళ్తూ వెళ్తూ జర్క్ ఇచ్చిందిగా అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతోన్న చర్చ ఇది.
ఇదిలావుంటే.. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వేదికగా ఉగాది ముందస్తు వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి సహా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రజల మేలు కోసమే రాజ్‌భవన్ ఉందని, అందుకే వారి సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తుల విభాగం ఏర్పాటు చేశామని గవర్నర్ అన్నారు. దాని ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించానని చెప్పారు.
దీంతో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అధికారిక యుద్ధ ప్రకటన విడుదల వచ్చేసింది. మే నెల నుంచి ప్రజాదర్బార్ నడుస్తుందని తేల్చి చెప్పిన గవర్నర్ తమిళిసై. శుభకృత్ నామ సంవత్సరం తెలుగువారి జీవితాల్లో వెలుగు నింపాలని, ఈ ఏడాది ప్రజలకు శుభప్రదంగా, సంతోషమయంగా ఉండాలని ఆకాంక్షించారు. రాజ్‌భవన్‌లో ఉగాది ఫ్లెక్సీలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడా సీఎం కేసీఆర్ ఫొటోలు కనిపించకపోవడం విచిత్రం. రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆహ్వానకార్డులు పంపినా వారంతా డుమ్మా కొట్టారు.
పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తూ సీఎంవో పంపిన ఫైలును గవర్నర్ పక్కన పెట్టడంతో రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య విభేదాలు తలెత్తాయి. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ వేళ రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరదూరంగానే ఉన్నారు.
తన ప్రసంగం లేకుండానే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగడంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. యాదాద్రి ఉద్ఘాటన ఉత్సవానికీ గవర్నర్‌ను ఆహ్వానించలేదు. ఉగాది ముందస్తు వేడుకలకు ముఖ్యమంత్రి వస్తారని ఆశించినా అది జరగలేదు. ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలకు ఆహ్వానించి ఉంటే తప్పకుండా వెళ్లేదాన్నని గవర్నర్ ప్రకటించడం కొస మెరుపు.
ఇవి కూడా చదవండి: Rachakonda Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి ఉచిత కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
Drugs Case: డ్రగ్స్ కొనుగోళ్లకు కేటుగాళ్ల సీక్రెట్ కోడ్.. మత్తు దందాలో వెలుగులోకి కొత్త కోణాలు.