Hyderabad: పిస్తా హౌస్‌ బిర్యానీ అంటూ లొట్టలేసుకుంటూ తింటున్నారా..? ఇది తెలిస్తే.. అమ్మబాబోయ్..

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. లేటెస్ట్‌గా నగరంలోని పిస్తాహౌజ్ రెస్టారెంట్లపై ఫుడ్‌సేఫ్టీ అధికారులు కొరడా ఝలిపించారు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అండ్ టాస్క్ ఫోర్స్ బృందాలు పిస్తా హౌస్‌ రెస్టారెంట్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Hyderabad: పిస్తా హౌస్‌ బిర్యానీ అంటూ లొట్టలేసుకుంటూ తింటున్నారా..? ఇది తెలిస్తే.. అమ్మబాబోయ్..
Raids On Pista House

Updated on: Aug 13, 2025 | 10:27 AM

హైదరాబాద్‌ నగరంలో హలీం, బిర్యానీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు పిస్తా హౌస్. హైదరాబాద్‌కే ఒక బ్రాండ్‌గా నిలవడమే కాదు.. ఇక్కడ నుంచి హలీమ్ విదేశాలకు సైతం సరఫరా అవుతోంది. అలాంటి ఈ రెస్టారెంట్‌ ఇప్పుడు వినియోగదారులను షాక్‌కు గురిచేసేలా తయారైంది. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ అండ్ టాస్క్ ఫోర్స్ బృందాలు పిస్తా హౌస్‌ రెస్టారెంట్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, అత్యంత దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో ఉన్న 25 పిస్తాహౌజ్ రెస్టారెంట్లలో అధికారులు మెరుపు దాడులు చేశారు. 23 రెస్టారెంట్లలో తనిఖీలు చేశారు. వాటి నుంచి శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు.

పిస్తాహౌజ్ రెస్టారెంట్లు ఫుడ్‌సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిస్తాహౌజ్ రెస్టారెంట్లలో కిచెన్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. కిచెన్‌లో ఎలుకలు, బొద్ధింకలు, ఈగలు తిరుగుతున్నాయని మండిపడ్డారు. నాన్‌వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను రెస్టారెంట్ల నిర్వాహకులు వాడుతున్నట్లు నిర్ధారణ అయినట్లు చెప్పారు. తుప్పు పట్టిన ఫ్రిడ్జ్‌లో నాన్‌వెజ్ స్టోర్ చేస్తున్నారని తెలిపారు. తుప్పు పట్టిన కత్తులతో కూరగాయలు కటింగ్ చేస్తున్నట్లు వివరించారు.

వీడియో చూడండి..

ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేసినా, పిస్తా హౌస్‌ నిర్వాహకులు తమ పద్ధతులను మార్చుకోవడం లేదని స్పష్టమవుతోంది. నగరంలో ఏ రెస్టారెంట్ అయిన ఫుడ్‌సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నగరంలో తాము ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నామని.. నగరంలోని రెస్టారెంట్లపైన ఎప్పుడైనా తనిఖీలు జరగొచ్చని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..