బీజేపీ జాతీయ కార్యవర్గాల సమావేశాల్లో తెలంగాణ వంటకాలు ఘుమఘుమలాడాయి. హైదరాబాద్‌లో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు రెండోరోజూ కొనసాగుతున్నాయి. సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ సహా ఇతర ప్రతినిధులకు తెలంగాణ వంటకాలను వడ్డించనున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ చేతి వంటకాలను కమల దళం ఆస్వాధించారు. యాదమ్మ వంటకాలను ఆరగించిన ప్రధాని మోదీ.. ఫిదా అయ్యారు. ఈ వంటకాలను ప్రధాని మోదీ స్వయంగా పరిశీలించి రుచి చూశారు. ఏమేం వడ్డిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వంటకాల గురించి ప్రతినిధులు ప్రధానికి వివరించారు. ప్రధాని సహా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణ వంటకాలను రుచి చూసి యాదమ్మపై ప్రశంసలు కురిపించారు.
శనివారం యాదమ్మ బృందం నోవాటెల్‌కు చేరుకున్నప్పటి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ప్రధాని మోదీ మూడుసార్లు డైనింగ్హాల్ను సందర్శించి.. కొన్ని వంటలు రుచి చూశారని.. మరికొన్నింటి వివరాలు అడిగి తెలుసుకున్నారని పార్టీ నేతలు తెలిపారు.
గౌరవెల్లి గుడాటిపల్లెకి చెందిన యాదమ్మ.. బీజేపీ అగ్రనేతల కోసం ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలను సిద్ధం చేశారు. భోజనంతోపాటు స్నాక్స్, స్వీట్స్ సైతం తెలంగాణ రుచులను వడ్డించారు. మొత్తం 50 రకాల వెరైటీలు ఉన్నాయి. ఇంత పెద్ద వేదికపై ప్రధాని నుంచి వీవీఐపీలకు తన చేతి వంట రుచి చూపించడం ఎంతో ఆనందంగా ఉందంటున్నారు యాదమ్మ.