ఐటీసీ కోహినూర్ పబ్(ITC Kohinoor Pub) కేసు మలుపులు తిరుగుతోంది. రాయదుర్గం(Rayadurgam) పీఎస్‌కు బాధిత యువతి, విష్ణు చేరుకున్నారు. తమపై ఓ గ్యాంగ్ దాడికి పాల్పడిందని విష్ణు చెప్పారు. తాను, యువతితో కలిసి పబ్ కు వెళ్లామని, అక్కడ కొందరు అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారని, అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దాడి చేశారని వెల్లడించారు. దాదాపుగా ఎనిమిది మంది ఉన్నారని, తమపై దాడి చేసిన వారు పలుకుబడి కలిగిన వాళ్ళ పిల్లలుగా ఉన్నారని తెలిపారు. కాగా ఈ ఘటనపై దాడి చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మయాంక్.. అతని స్నేహితులు కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో (Hyderabad) కేసు పెట్టారు. యువతితో పాటు వచ్చిన విష్ణూ, విక్రమ్ లు తమపై దాడి చేశారంటూ మాయంక్ అతని స్నేహితులు ఫిర్యాదు చేశారు. తమపై విచక్షణ రహితంగా దాడి చేశారని కంప్లైంట్ చేయడంతో పోలీసులు విక్రమ్, విష్ణు పై కేసు నమోదు చేశారు. అనంతరం వారికి సమాచారం అందించారు. స్టేషన్ కు రావాలంటూ ఫోన్ చేశారు. తమతో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసు పెట్టుకుండా.. తమపై పెట్టడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు.
మాయంక్, అతని స్నేహితులకు బాధితురాలు గతంలోనే పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్ లో తోపులాట జరిగిన తరువాత, నో స్మోకింగ్ ఏరియాలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు తెలుసుకున్నారు. ఈ దాడిలో విష్ణుకు గాయాలయ్యాయి. దీంతో బాడీ బిల్డర్ విక్రమ్ మయంక్ పై దాడి చేశాడు. సీసీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. నో స్మోకింగ్ ఏరియాలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఏం జరిగిందనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
కాగా.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో స్టార్ హోటల్ పబ్ లో యువతి పై కొందరు యువకులు దాడి చేశారు. న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషన్ గా పని చేస్తున్న యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. రూఫ్ టాప్ పబ్ లాంజ్ లో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఇద్దరు స్నేహితులతో కలిసి పబ్ కు వెళ్ళిన యువతితో 8 మంది యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆపేందుకు ప్రయత్నించిన స్నేహితురాళ్లపై బాటిల్స్ తో విచక్షణ రహితంగా దాడి చేశారు. పబ్ లో ఉన్న సమయంలో బాధితురాలి దగరికి వచ్చి ఫోన్ నంబర్ అడిగగా ఇచ్చేందుకు యువతి నిరాకరించింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన యువకులు అసభ్య పదజాలంతో దూషించారు.
ఈ ఘటనతో బాధితురాలు తీవ్ర ఆవేదన చెంది రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.