Covid Vaccination: కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా వ్యాక్సినేషన్.. హైదరాబాద్‌కు మరో ముప్పు తప్పదా..?

Hyderabad Old City Covid Vaccination: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతంగా

Covid Vaccination: కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా వ్యాక్సినేషన్.. హైదరాబాద్‌కు మరో ముప్పు తప్పదా..?
Covid Vaccination
Follow us

|

Updated on: Sep 04, 2021 | 6:27 PM

Hyderabad Old City Covid Vaccination: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణలో చేపట్టిన వ్యాక్సినేషన్‌లో ఒక్కచోట మాత్రమే ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి కాగా, పాతబస్తీలో మాత్రం పూర్తిగా నత్తనడకలో సాగుతోంది. దీనిపై వైద్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఓల్డ్‌సిటీ కరోనా హబ్‌గా మారే ప్రమాదం ఉందంటున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో అర్హులైన వారందరికీ వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని 15 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రోజూ కాలనీల్లో వందశాతం వ్యాక్సినేటేడ్ అంటూ సర్టిఫై చేస్తూ ఫ్లెక్సీలు కూడా పెడుతున్నారు. కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం ఈ ఫ్లెక్సీలు కనిపించడం లేదు. వ్యాక్సిన్‌ వేసుకునేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో పాతబస్తీ జోన్ లో ఉన్న చార్మినార్‌లో వ్యాక్సిన్ డ్రైవ్ చాలా డ్రైగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ వేసేందుకు వైద్యశాఖ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగినా మిశ్రమ స్పందనే కనిపిస్తోందంటూ.. పలువురు పేర్కొంటున్నారు. మొబైల్ వ్యాక్సినేషన్ వ్యాన్లు కాలనీల్లో చక్కర్లు కొడుతున్నా ప్రజలు మాత్రం స్పందించడం లేదని.. ఇలానే ఉంటే.. పాత బస్తీలో కరోనా విజృంభించే ప్రమాదముందని పేర్కొంటున్నారు.

చార్మినార్ జోన్లో మొత్తం 849 కాలనీలను వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం జీహెచ్ఎంసీ ప్రణాళికలు చేపట్టగా.. 10 రోజుల్లో సగం కాలనీల్లో కూడా వంద శాతం పూర్తి కాలేదు. కానీ మిగతా జోన్లలో మాత్రం 90 శాతానికిపైగా కాలనీల్లో ఇది సాధ్యమైంది. ముఖ్యంగా ఎల్బీ నగర్ జోన్ లో ఎంపిక చేసుకున్న అన్ని కాలనీల్లో వందశాతం పూర్తయింది. చార్మినార్ జోన్లో 849 కాలనీలకు గాను 540 కాలనీల్లో మాత్రమే వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయింది. ఎల్‌బినగర్‌లో 1072 కాలనీలను టార్గెట్ పెట్టుకోగా.. 1072 కాలనీల్లో విజయవంతంగా వందశాతం వ్యాక్సినేషన్ పుర్తి చేశారు.

పాతబస్తీలోని చాంద్రాయణ గుట్టలో 50 శాతానికి కంటే తక్కువే వ్యాక్సినేషన్ నమోదయింది. ఇక్కడ మొత్తం 108 కాలనీలు ఉంటే 43 కాలనీల్లో మాత్రమే వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. చార్మినార్ సర్కిల్ లో 150 కాలనీలకు 80 కాలనీలు, మలక్ పేట్ సర్కిల్ లో 194 కాలనీలకు 106, సంతోష్ నగర్ 127 కాలనీలకు 115 కాలనీల్లో మాత్రమే వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ఫలక్‌నుమాలో 90 కాలనీలకు 54, రాజేంద్రనగర్ 190 కాలనీలకు 137 కాలనీల్లో మాత్రమే వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయింది.

ఇక మిగిలిన జోన్లలో సికింద్రాబాద్ లో 756 కాలనీలకు గాను 648, కూకట్ పల్లి జోన్ 542 కాలనీలకు 504, శేరిలింగంపల్లిలో 347 కాలనీలకు 283, ఖైరతాబాద్ జోన్ లో 548 కాలనీలకు గానూ 535 కాలనీల్లో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ పూర్తి చేశారు. శుక్రవారం నాటికి చార్మినార్ మినహా మిగిలిన అన్ని జోన్లలో 95 శాతానికి మించి వ్యాక్సినేషన్ పూర్తైనట్టు బల్దియా అధికారులు తెలిపారు.

పాత బస్తిలో ఎక్కువ మంది ముస్లింలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యాక్సిన్ తయారీ తొలినాళ్లలో కొంతమంది వ్యాక్సిన్ పై అనుమానాలు వ్యక్తం చేయడం, వ్యాక్సిన్ (హలాల్) పవిత్రమైనదా కాదా అనే కోణంలో ముస్లిం దేశాల సందేహాలు వ్యక్తంకావడం, తయారీలో పందికొవ్వు వినియోగించారన్న సోషల్ పోస్టులతో ముస్లింలు వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపడం లేదు. ముఖ్యంగా అపోహలు నెలకొన్న ముస్లిం మధ్యతరగతి వర్గం సందిగ్ధంలో పడి వ్యాక్సిన్ వేసుకునేందుకు జంకుతున్నారు. ఇక కొంతమంది ముస్లిం యువకులు మాత్రం నిర్లక్ష్య ధోరణితో అటువైపు చూడటం లేదు.

చావు, బతుకు దేవుడి చేతుల్లో ఉందని, వ్యాక్సిన్‌ తీసుకుంటే కరోనా రాకుండా ఉంటుందని ప్రభుత్వం చెప్పడం లేదని ఓల్డ్‌సిటీలో కొందరు వాదిస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవాలని సినీ ప్రముఖులు మాత్రమే ప్రచారం చేస్తున్నారని, వారితోపాటు స్థానిక నేతలు, డాక్టర్లు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారంటూ పేర్కొంటున్నారు. ఇలాంటి క్రమంలో కొంతమంది ముందడుగు వేసి.. వ్యాక్సిన్‌ తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు పేర్కొంటున్నారు.

కాగా.. పాత బస్తీలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మకూడదంటూ అసదుద్దీన్‌ సూచించారు. తన కుటుంబ సభ్యులంతా వ్యాక్సిన్‌ తీసుకున్నారని పేర్కొన్నారు. అందరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, దీనిపై ఎలాంటి అపోహలు నమ్మవద్దంటూ అసదుద్దీన్‌ సూచించారు.

Also Read:

Hyderabad: ఆకాశానికి చిల్లు పడిందా ఏంటి.. భాగ్యనగరంలో దంచికొడుతోన్న వర్షం.. మరో 2 రోజులు

బయటకు వెళ్లాలనుకుంటే వెళ్ళండి.. ఎంపీ కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఘాటు వ్యాఖ్యలు