ఫుడ్ నుంచి ట్యాక్సీ బుకింగ్ వరకు.. ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే. ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్స్ యాప్స్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. అయితే ఈ యాప్స్‌ను ఉపయోగించే వారు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలు.. ఇలా అన్నీ కలుపుకొని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువు అసలు ధరకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇక క్యాబ్‌ల విషయానికొస్తే.. ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో ఎక్కువ వసూలు చేస్తున్నారు. దీంతో వినియోగదారుల జేబులకు చిల్లుపడే పరిస్థితి వచ్చింది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్‌డీసీ (ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను ప్రారంభించింది. డీపీఐఐటీ(డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) నేతృత్వంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువుల సేవలు అందించడం ఈ సేవల ముఖ్య ఉద్దేశం.
ఎలాంటి మిడిల్ యాప్ అవసరం లేకుండానే ఫుడ్ మొదలు క్యాబ్స్ వరకు బుకింగ్ చేసుకోవచ్చు. ఓఎన్‌డీసీలో ఆర్డర్ చేసుకోవడం ద్వారా ప్యాకేజింగ్, ఇంటర్నెట్ ఛార్జీలు అంటూ అదనపు ఛార్జీలు ఉండవు. ఇప్పటికే కోల్‌కతా, బెంగళూరు, కొచ్చి, మైసూరు నగరాల్లో 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్‌తో ఈ వేదిక పనిచేస్తుండగా, తాజాగా హైదరాబాద్‌లోనూ ఈ సేవలను ప్రారంభించారు. ‘తెలంగాణ గిగ్‌వర్కర్స్ అసోసియేషన్’కు చెందిన డెలివరీబాయ్‌లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది.
ఓఎన్‌డీసీలో సేవలు పొందడానికి ప్రత్యేకంగా ఎలాంటి యాప్ అవసరం లేదు. యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారానే నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవలు పేటీఎమ్‌లో అందుబాటులో ఉన్నాయి. సుమారు 25 వేల మంది డెలివరీ బాయ్స్ ఈ వేదికగా పనిచేస్తున్నారు. వందల సంఖ్యలో రెస్టారెంట్స్ ఆర్డర్స్ తీసుకుంటాయి. ఓఎన్‌డీసీ సేవలను వినియోగించుకునే వారికి అదనపు ఛార్జీల నుంచి ఉపశమనం లభించనుంది. ఈ సేవలు ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తే సుమారు రూ. 50 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..