
హైదరాబాద్ దక్షిణ భాగంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు జీహెచ్‌ఎంసీ కీలక ప్రాజెక్టును చేపట్టనుంది. మైలార్‌దేవ్‌పల్లి–శంషాబాద్ రోడ్–కాటేదాన్ జంక్షన్‌ల మధ్య ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించేందుకు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.345 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. జీహెచ్‌ఎంసీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హైదరాబాద్ సిటీ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్–సిటీ) కార్యక్రమంలో భాగంగా ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించనున్నారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) నిర్వహించిన ట్రాఫిక్ అధ్యయనం ఆధారంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కాటేదాన్ జంక్షన్ వద్ద మూడు లైన్ల ఏకదిశ డౌన్ ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. సర్వేలు, పరిశోధనలు, డీటైల్డ్ డిజైన్, నిర్మాణ పనులను ఎంపిక చేసిన ఏజెన్సీ చేపడుతుంది.
ఈ ఫ్లైఓవర్ పూర్తయితే ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణ సమయం బాగా తగ్గనుంది. ముఖ్యంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు, అలాగే పరిసర నివాస, పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు పెద్ద ఊరట కలగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.