
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.. హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చేప్పింది.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో హైదరాబాద్ అధికారులు, జలమండలి అధికారులు అలర్ట్ అయ్యారు. ఉస్మాన్‌సాగర్ 4 గేట్లు, హిమాయత్‌సాగర్ 1 గేట్ ద్వారా ముందస్తుగా నీటిని విడుదల చేశారు. ఇటీవల హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీగా వరదలు రావడంతో .. ముందస్తు జాగ్రత్తగా జంట జలాశయాలకు చేరుతున్న నీటిని జలమండలి బయటకు వదిలారు. ఈ నేపథ్యంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జంట జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు.
జంట జలాశయాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. రెవెన్యూ, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉస్మాన్‌సాగర్(గండిపేట) రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 4 గేట్లను 2 ఫీట్ల మేర ఎత్తి 920 క్యూసెక్కులు నీటిని మూసిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్‌కు 100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
హిమాయత్‌సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరువలో నీరు ఉండటంతో 1 గేట్ ను 3 ఫీట్ల మేర ఎత్తి 1017 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌కు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
ఆరెంజ్ అలర్ట్ – వాతావరణ సూచనలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త చర్యగా, హిమాయత్ సాగర్ నుండి నీటి విడుదలను దశలవారీగా 2000 క్యూసెక్కులకు, ఉస్మాన్ సాగర్ నుండి 3000 క్యూసెక్కులకు పెంచబడుతుందని అధికారులు ప్రకటనలో తెలిపారు. రెండు రిజర్వాయర్ల నుండి కలిపి మొత్తం విడుదల మధ్యాహ్నం 3:00 గంటల నుండి 5000 క్యూసెక్కులను దిగువనకు వదిలినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..