
హైదరాబాద్: బోధన్‌లో ఎంఐఎం నేతలను వేధిస్తున్నారు.. 2028లో మా సత్తా చూపిస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లను కూల్చివేస్తోంది.. తెలంగాణ ఏమైనా ఉత్తరప్రదేశ్ (UP) అనుకుంటున్నారా..? అంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. మజ్లిస్ కార్యకర్తల ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బోధన్‌లో ఎంఐఎం నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. 2028 ఎన్నికలు వస్తాయి.. అప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా అసదుద్దీన్ తీవ్ర విమర్శలు చేశారు. బుల్డోజర్లతో కూల్చివేతలు చేస్తున్నారు. ఇది తెలంగాణ అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు.
ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జరిగిన రాష్ట్రాల్లో ఫామ్ నంబర్-7 ద్వారా ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ముఖ్యంగా ముస్లిం ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ అనుబంధ సంస్థలు ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ విషయంలో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరూ తమ పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఓవైసీ సూచించారు. ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే తమ భారత పౌరసత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని అసదుద్దీన్ పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో ముస్లింల ఓట్లను తొలగించేందుకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలు ఫామ్ నంబర్-7 దరఖాస్తులు చేస్తున్నారని కూడా ఓవైసీ ఆరోపించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైతే ఎంఐఎం విజయం సాధించిందో అక్కడ ప్రజల మధ్యలో ఉండి మరింత కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు ఓవైసీ సూచించారు. ఓడిపోయిన ప్రాంతాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. తమకు విజయం ఖాయమని భావించిన కొన్ని చోట్ల ఓటమికి పార్టీ అంతర్గత విభేదాలే కారణమయ్యాయని పేర్కొన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని అసద్ సూచించారు.