Hyderabad: ఆ ఒక్క పనితో.. సైబర్ మోసానికి గురై పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టుకున్నారు..

ఈ మధ్య చోర్ గాళ్లు ఎంత స్మార్ట్ అయ్యారో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం మన లైఫ్ అంతా డిజిటల్‌కి ముడి పడి ఉండటంలో.. వారి మాయలు ఈజీ అయిపోయాయి. ఇలా ఎవరైన తెలియక డబ్బు పోగొట్టుకుంటే.. ఆ మొత్తాన్ని తిరిగి పొందేందుకు ఒకే ఒక అస్త్రం ఉంది.

Hyderabad: ఆ ఒక్క పనితో.. సైబర్ మోసానికి గురై పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాబట్టుకున్నారు..
Cybercrime Golden Hour

Edited By: Ram Naramaneni

Updated on: Dec 12, 2025 | 7:44 PM

సైబర్ మోసగాళ్లకు బలవుతున్న బాధితుల డబ్బును కాపాడడంలో గోల్డెన్ అవర్ మరోసారి ఎంత కీలకమో హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు వరుసగా రెండు కేసుల్లో రుజువు చేశారు. సమయానికి ఫిర్యాదు చేసిన ఇద్దరు బాధితులకు అధికారులు మొత్తం రూ.6.23 లక్షలు తిరిగి రాబట్టారు. డిసెంబర్ 5న యూసుఫ్‌గూడకు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు వాట్సాప్‌లో ‘ట్రాఫిక్ ఫైన్ రూ.1,000 చెల్లించండి’ అంటూ ఒక మెసేజ్‌ వచ్చింది. ఆ మెసేజ్‌తో పాటు ‘M-Parivahan’ పేరుతో ఒక APK ఫైల్ డౌన్‌లోడ్ లింక్‌ పంపించారు. బాధితుడు తెలియక ఆ ఫైల్ ఇన్‌స్టాల్ చేస్తే.. అతని మొబైల్‌లోని OTPలను దొంగిలించి, మోసగాళ్లు రూ.5,23,125 విలువైన ట్రాన్సాక్షన్లు చేశారు. వెంటనే అప్రమత్తమైన యువకుడు 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేసాడు. వెంటనే పోలీసులు ఐసీఐసీఐ బ్యాంక్, అమెజాన్ పేలకు నోటీసులు పంపి ట్రాన్సాక్షన్లను ఆపించారు. అలా మొత్తం రూ.5.23 లక్షలు బాధితుడికి తిరిగి జమయ్యాయి.

అంబర్‌పేట్ వ్యక్తి కూడా ఇలాంటి అనుభవం..

డిసెంబర్ 10న అంబర్‌పేట్‌కు చెందిన 53 ఏళ్ల వ్యక్తికి ‘RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్‌డేట్’ పేరుతో మరో APK ఫైల్ వచ్చింది. దాన్ని ఇన్‌స్టాల్ చేయగానే మోసగాళ్లు అతని అకౌంట్ నుంచి రూ.1,25,822 డెబిట్ చేశారు. ఇంకా మరిన్ని ట్రాన్సాక్షన్లు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే బాధితుడు సైబర్ క్రైమ్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే కేసును ట్రేస్ చేసి, డబ్బు ఫ్లిప్‌కార్ట్, మొబిక్విక్ డిజిటల్ వాలెట్‌లకు వెళ్లినట్లు గుర్తించారు. ఆ ఆర్డర్లు రద్దు చేసి, రూ.1 లక్షను తిరిగి బాధితుడికి రిఫండ్ చేశారు.

సైబర్ నేరాల్లో ఫిర్యాదు చేసిన తొలి కొన్ని నిమిషాలే గోల్డెన్ అవర్ అని అధికారులు తెలిపారు. ఈ సమయంలోనే ఫిర్యాదు చేస్తే.. ట్రాన్సాక్షన్లు బ్లాక్ చేయడం, అకౌంట్లు ఫ్రీజ్ చేయించడం, డబ్బును రివర్స్ చేయించడం వంటివి చేయగలమని చెబుతున్నారు. వాట్సాప్, SMS, సోషల్ మీడియా ద్వారా వచ్చే APK ఫైళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయొద్దని కోరుతున్నారు. యాప్‌లు కేవలం గూగుల్ ప్లే/యాప్ స్టోర్ వంటి అధికారిక వేదికల నుంచే డౌన్‌లోడ్ చేయాలంటున్నారు. ఈ–కామర్స్ సైట్లలో బ్యాంక్ వివరాలు సేవ్ చేయకూడదని.. మోసం జరిగిన వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.