మహా నగరంలో మరో అద్భుత నిర్మాణం అందుబాటులోకి రానుంది. ఉప్పల్ జంక్షన్ వద్ద పాదచారుల ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ స్కై వాక్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే అత్యంత పొడవైన స్కైవాక్ ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లో 30 అడుగుల ఎత్తులో మెట్రో రైళ్లు వెళ్తున్నాయి. 20 అడుగుల ఎత్తులోని ఫ్లై ఓవర్లపై సిటిజన్స్ రయ్‌రయ్ మని తిరుగుతున్నారు. ఇప్పుడు ఇంచుమించు అదే ఎత్తులో సరికొత్తగా రూపుదిద్దుకుంది బ్రిడ్జి. ఈనెల 26వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ స్కైవాక్ ప్రత్యేకతలు ఏంటి.? దీని నిర్మాణానికి అయిన ఖర్చు ఎంత లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
చుట్టూ సేఫ్టీ విత్ స్టైల్ వాల్స్..అండ్ సేఫ్టీ వాక్..అక్కడ నడుస్తుంటేనే అదోరకమైన అనుభూతి. ఆకాశ వీధిలో అందమైన పచ్చటి చెట్ల అలంకరణతో..నడుస్తున్న ఫీల్ కలుగుతుంది. ఎలాంటి ట్రాఫిక్ ఉండదు.. రణగొణ ధ్వనులు ఉండవు. ఏ కారు ఎటువైపు నుంచి వస్తుందోనన్న భయమూ అవసరం లేదు. ఏ బైకూ మిమ్మల్ని ఢీ కొట్టదు. కూల్‌గా.. రిలాక్స్‌గా.. మార్నింగ్ పార్క్‌లో వాకింగ్ చేసినంత ఈజీగా వెళ్లొచ్చు. పైగా స్కై వాక్ చేస్తూ.. కింద స్పీడుగా వెళ్లే వెహికల్స్‌ను ఏరియల్ వ్యూలా చూస్తూ అనుభూతి పొందొచ్చు.
దేశంలోని మెట్రో నగరాల్లో 2020 నుంచి ఆకాశ వంతెనల నిర్మాణం చేపట్టారు. చెన్నై సహా మరికొన్నిచోట్ల..ఇలాంటి వాటిని స్మార్ట్ సిటీ మిషన్ నిధులతో నిర్మించారు. బట్ హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని చేపట్టింది.. ఉప్పల్ రింగ్ రోడ్డులో దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను సిద్ధం చేసింది. ఈనెల 26న మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జిను ప్రారంభించనున్నారు. రూ. 25 కోట్లతో స్కై వాక్ బ్రిడ్జిని నిర్మించారు. ఇది అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు.. అలాగే పాదచారుల కష్టాలు తీరినట్లే. అంతేకాదు, స్కై వాక్ పై నియంత్రణ నిఘా ఏర్పాట్లు కూడా చేశారు. సీసీ కెమెరాలు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. స్కై వాక్ బ్రిడ్జి మీదే పాదచారుల కోసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా కల్పించారు. ఇరువైపులా రక్షణ కోసం రెయిలింగ్ సెట్ చేశారు.
సిటీలో అతిపెద్ద ఉప్పల్ జంక్షన్‌లో బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. గతంలో ప్రవేశపెట్టిన ఫ్రీ లెఫ్ట్ విధానం అమల్లో ఉన్నప్పటికీ..పాదచారుల సమస్యలు మాత్రం తీరలేదు. వంతెనను ఉప్పల్ మెట్రో రైల్వే స్టేషన్ కు అనుసంధానించడంతో స్కైవాక్ బ్రిడ్జి ద్వారా..నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునే వెసులుబాటు ఉంది. ఉప్పల్ జంక్షన్‌లో రోడ్డు దాటాలంటే యమపురికి దార్లు వెతుక్కోవడమే..రోడ్డు దాటేంత వరకు బతికుంటే చాలురా భగవంతుడా అన్నట్లుంటుంది అక్కడి ట్రాఫిక్.. చాలా ప్రమాదాలు జరిగాయి..ఎంతోమందికి కాళ్లు చేతులు విరిగాయి. ఎంతో మంది చనిపోయారు. కానీ ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. హాయిగా..కూల్‌గా.. ఒక పార్కులో సేద తీరుతున్న ఫీలింగ్‌లో స్కై వాక్‌లపై అటు నుంచి ఇటు వెళ్లొచ్చు. రావొచ్చు.
ఇదిలా ఉంటే నగరంలో ఇలాంటి మరికొన్ని ఆకాశ వంతెనలు అందుబాటులోకి రానున్నాయి. పైలట్ ప్రాజెక్టుల కింద ప్రస్తుతానికి ఉప్పల్, మెహదీపట్నంలో నిర్మించారు. అయితే మెహదీపట్నం డిజైన్ వేరు.. ఉప్పల్ డిజైన్ వేరు. ఒక్కో స్కైవాక్ బ్రిడ్జి ఒక్కో స్టైల్‌లో రూపుదిద్దుకుంటోంది. భవిష్యత్తులో సిటీలోని చాలా ప్రాంతాల్లో ఆకాశ వీధిలో అందమైన రోడ్ పార్క్స్‌లో ఆహ్వాదకరంగా నడుస్తూ..అందమైన వాక్ చేయొచ్చన్నమాట.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..