
జనవరి 30వ తేదీన మహత్మాగాంధీ వర్ధంతి జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాంసం విక్రయాలు బంద్ కానున్నాయి. గాంధీ జయంతి, వర్థంతి సందర్భంగా ప్రతీసారి మాంసం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధం విధిస్తూ ఉంటాయి. ఈసారి కూడా అదే తరహాలోనే నిర్ణయం అమలు చేయనున్నారు. ఈ క్రమంలో జనవరి 30న హైదరాబాద్‌లో మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ మేరకు తాజాగా జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. మాంసం షాపులతో పాటు గొర్రెలు, మేకల కబేళాలు కూడా మూసివేయాలని ఆదేశించింది.
మహత్మాగాంధీ వర్దంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో మాంసం విక్రయాలపై బ్యాన్ విధించినట్లు జీహెచ్‌ఎంసీ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరించారు. దీనిని పటిష్టంగా అమలు చేసేందుకు ప్రజలతో పాటు షాపుల యజమానులు సహకరించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. అన్ని షాపుల నిర్వహకులు తమకు సహకరించాలని కోరింది. ప్రతీ ఏడాది గాంధీ వర్ధంతి సందర్భంగా మాంసం దుకాణాలు మూసి ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఈ సారి కూడా అది కొనసాగిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. జాతిపిత మహత్మాగాంధీకి గౌరవార్ధంగా ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
అటు హైదరాబాద్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మాంసం విక్రయాలపై నిషేధం కొనసాగనుంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఏపీలో కూడా జనవరి 30న మాంసం షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు నగర పాలక సంస్థలు ప్రకటన జారీ చేస్తున్నాయి.