
హైదరాబాద్‌లో ఓ మందుబాబు ట్రాఫిక్ పోలీసులకు మస్కా కొట్టాడు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు వెంగల్ రావు పార్క్ గేటు ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. తనిఖీల్లో మొత్తం 5 బైకులు, 3 కార్లు పట్టుబడ్డాయి. అయితే అందులో ఒక బ్లూ కలర్ ఆడి కార్ (టీఎస్ 09 FD 1116) డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మద్యం సేవించి నడుపుతూ పోలీసులకు చిక్కింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించినట్లు కన్ఫామ్ అయ్యింది. డ్రైవింగ్ లైసెన్స్ కారు లోపల వెతుకుతున్నట్లు నటించిన ఆ వ్యక్తి.. అదే సమయానికి మిగతా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు బురిడీ కొట్టి.. సీజ్ చేసిన కారులోనే పారిపోయాడు. పోలీసుల విచారణలో ఆ కార్ వెంకటేశ్వర ప్యాకేజింగ్ పేరుతో ద్వారకపురి, పంజాగుట్ట అడ్రస్‌లో రిజిస్టర్ అయినట్లు వెల్లడైంది. పరారైన వ్యక్తి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అతని ఆచూకీ అందుకోవడం కష్టంగా మారింది. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. పరారైన మందుబాబును ట్రేస్ చేయడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి