Hyderabad: ఓరి వీడు పాడుగాను.. యూట్యూబ్‌ను ఎందుకు వాడుకున్నాడో తెల్సా..?

| Edited By: Ram Naramaneni

Jan 09, 2025 | 2:20 PM

సోషల్ మీడియా అనేది ఇప్పటి తరానికి జీవితంలో ఒక భాగంలా మారిపోయింది. ఆ సామాజిక మాధ్యమాన్ని మంచికి వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు.. అదే చెడుగా వాడుకుంటే చెడు దారుల్లో వెళ్తాం. యూట్యూబ్ అనేది ఎవరైనా సినిమాలు, పాటలు వినడాని కోసం ఉపయోగించడం చూశాం. స్వతహాగా వీడియోలు చేస్తూ సంపాదించుకోవడం చూశాం. కానీ, ఇక్కడ ఓ ప్రబుద్ధుడు ఎలా వినియోగించాడో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.

Hyderabad: ఓరి వీడు పాడుగాను.. యూట్యూబ్‌ను ఎందుకు వాడుకున్నాడో తెల్సా..?
Sairam
Follow us on

చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో యూట్యూబ్ ద్వారా చూసి నేర్చుకొని గొలుసు దొంగతనానికి పాల్పడ్డాడు. చాలా వింతగా ఉంది కదూ.. యూట్యూబ్ చూసి చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో నేర్చుకొని గొలుసు దొంగతనానికి పాల్పడిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన కొట్టి సాయిరాం అనే వ్యక్తి నెల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి ప్రశాంత్ నగర్ ప్రాంతంలోని ఫార్మా కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన బాలాజీనగర్ లో ద్విచక్ర వాహనం దొంగతనం చేశాడు. పైగా అదే రోజు వివేకానంద నగర్ కాలనీలో శ్వేత అనే ఓ మహిళ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె మెడలో నుంచి గొలుసు తెంపుకుని పరారయ్యాడు. వెంటనే చోరీ చేసిన గొలుసును ముత్తూట్ సంస్థలో కుదవ పెట్టి డబ్బులు తీసుకున్నాడు. ఇంకేముంది.. ఎంచక్కా దొంగతనం చేశామా.. దాన్ని నగదుకు బదిలీ చేసుకున్నామా అన్నట్లు దర్జాగా తప్పించుకున్నా అని అనుకున్నాడు.

అయితే.. తన గొలుసు పోయిందనే బాధలో బాధితురాలు కూకట్ పల్లి పోలీసులను సంప్రదించింది. జరిగిన విషయం చెప్పి పోలీసుల సహాయం కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు 180 సీసీ ఫుటేజీలను పరిశీలించి ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసిందీ.. గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి ఒకరే అని నిర్దారించుకున్నారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా పోలీసులు ముత్తూట్ ఫైనాన్స్ కు నోటీసులు జారీ చేసి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనిని అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ రావు పలు సంచలన విషయాలను వెల్లడించారు. నిందితుడు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముదినేపల్లిలో సైతం 5 వాహనాలను చోరీ చేసిన కేసులో నిందితుడని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.