Hyderabad: డేంజర్ ఇంజక్షన్.. మ్యాటర్ వీకవుతుంది.. ఆ తర్వాత లివర్, కిడ్నీలు పోతాయ్..

చెమట చిందించకుండానే కండలు పెంచాలి.. జిమ్‌లో కష్టపడకుండానే బాడీ బిల్డర్ అయిపోవాలి.. యువతలోని ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుంది ఓ ముఠా. ఇన్‌స్టంట్ ఫిట్‌నెస్ పేరుతో శరీరంలోకి విషాన్ని ఎక్కిస్తున్న స్టెరాయిడ్ మాఫియా నెట్‌వర్క్‌ను హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు.

Hyderabad: డేంజర్ ఇంజక్షన్.. మ్యాటర్ వీకవుతుంది.. ఆ తర్వాత లివర్, కిడ్నీలు పోతాయ్..
Steroid Injections In Hyderabad

Updated on: Jan 26, 2026 | 5:33 PM

చెమట చిందించకుండానే కండలు పెంచాలి.. జిమ్‌లో కష్టపడకుండానే బాడీ బిల్డర్ అయిపోవాలి.. యువతలోని ఈ బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుంది ఓ ముఠా. ఇన్‌స్టంట్ ఫిట్‌నెస్ పేరుతో శరీరంలోకి విషాన్ని ఎక్కిస్తున్న స్టెరాయిడ్ మాఫియా నెట్‌వర్క్‌ను హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. జిమ్ సెంటర్లే అడ్డాగా.. వర్కవుట్లు చేసే కుర్రాళ్లే టార్గెట్‌గా ఈ దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. బాడీ ఫిట్ అవుతుందని మాయమాటలు చెప్పి ఈ ఇంజెక్షన్లను అంటగడుతున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి, అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.1.60 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, భారీగా సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. కనీసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ గానీ, లైసెన్స్ గానీ లేకుండా కేవలం లాభాపేక్షతోనే ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నిజానికి స్టెరాయిడ్స్ అనేవి రెండు వైపులా పదను ఉన్న కత్తి లాంటివి. వైద్య శాస్త్రంలో ఇవి ప్రాణ రక్షక ఔషధాలైనప్పటికీ.. సరైన లెక్కా పత్రం లేకుండా వాడితే పెను ప్రమాదానికి దారితీస్తాయి. కష్టపడకుండానే ఫలితం రావాలనుకునే యువత, ఈ ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు ఈ ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు..

స్టెరాయిడ్స్ వినియోగంపై హైదరాబాద్ సీపీ ఆందోళన వ్యక్తంచేశారు. స్టెరాయిడ్స్ వినియోగం వ్యసనంలా మారుతుందని.. సిక్స్ ప్యాక్ కోసం లివర్, కిడ్నీలు, భవిష్యత్తును నాశనం చేసుకోకండి.. అంటూ సూచించారు. శరీరంలోని అవయవాలకు నష్టం కలిగిస్తుందని.. వంధ్యత్వం (ఇన్‌ఫెర్టిలిటీ), మరణానికి కూడా దారితీస్తుందని హెచ్చరించారు. యువత ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలని.. అక్రమ మాదకద్రవ్యాల అమ్మకాల గురించి తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..