L Ramana – CM KCR: తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ కొంచెం సేపటి క్రితం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ప్రగతి భవన్‌కు వెళ్లిన ఎల్ రమణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. టీడీపీ తెలంగాణ శాఖలో అధ్యక్ష హోదాలో ఉన్న రమణ టీఆర్ఎస్‌లో చేరతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
గులాబీ కండువా కప్పుకున్న వేళ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైందని ఇప్పటికే జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి ఆయన సీఎం కేసీఆర్‌ను కలిశారు. రమణ కారెక్కడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కీలక భూమిక పోషించారు. ఎమ్మెల్సీ పదవి ఇప్పించే బాధ్యత తనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. రమణకు హామీ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తెలుగుదేశం పార్టీ బలం క్రమక్రమంగా తగ్గుతుండటంతో గత్యంతరం లేని పరిస్థిత్లో రాజకీయ భవిష్యత్ దృష్ట్యా రమణ టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.
టీడీపీ కార్యకర్తలతో కూడా ఈ విషయం గురించి రమణ చర్చలు జరిపారు. వారు కూడా ఓకే చెప్పడంతో గులాబీ దళంలో చేరాలని తుది నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బీసీ నాయకునిగా ఎలగందుల రమణకు గుర్తింపు ఉంది. కరీంనగర్ పార్లమెంటు నుంచి సీనియర్ అయిన చొక్కారావును ఓడించి రమణ సంచలనం సృష్టించారు. జగిత్యాలలో జీవన్ రెడ్డిని మట్టి కరిపించి చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జగిత్యాల నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడు . చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటు అని రమణకు పేరుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రమణ కొనసాగుతున్నారు.
Read also: KTR: మరోసారి తన మానవతను, మంచి మనసును చాటుకున్న మంత్రి కేటీఆర్