Hyderabad Metro: మెట్రో అధికారులను అభినందించిన కేటీఆర్… అవయవ దానానికి ముందుకు రావడంపై ప్రశంస…
ఒక ప్రాణాన్ని కాపాడడానికి ప్రత్యేక రైలు నడిపిన హైదరాబాద్ మెట్రో సిబ్బందికి, ఉన్నతాధికారులు ఎన్వీఎస్ రెడ్డికి, కేవీబీ రెడ్డికి ప్రత్యేక...
ఒక ప్రాణాన్ని కాపాడడానికి ప్రత్యేక రైలు నడిపిన హైదరాబాద్ మెట్రో సిబ్బందికి, ఉన్నతాధికారులు ఎన్వీఎస్ రెడ్డికి, కేవీబీ రెడ్డికి ప్రత్యేక అభినందనలు అని తెలంగాణ పరిశ్రమల, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన బుధవారం స్పందించారు. గుండె తరలింపు విషయమై వివిధ పత్రికల్లో ప్రచురించిన వార్తా కథనాలను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. అంతే కాకుండా అవయవ దానానికి ముందుకు వచ్చిన కుటుంబాన్ని సైతం కేటీఆర్ అభినందించారు.
కేటీఆర్ ట్వీట్ ఇదే…
What a heartwarming gesture!!@hmrgov and @ltmhyd have run a special train to help transport a live heart over 21km to save a life. My compliments to NVS Reddy & KVB Reddy ?
Also kudos to the family of the donor Narsi Reddy Garu whose family came forward for organ donation ? pic.twitter.com/ficNjBTkNp
— KTR (@KTRTRS) February 3, 2021
అవయవ దానానికి ముందుకు…
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన వరకాంతం నర్సిరెడ్డి బోరు డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆదివారం మోత్కూరులో పెట్రోలు బంకుకు వెళ్లిన నర్సిరెడ్డి హైబీపీతో పడిపోయారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఈయన్ను ఎల్బీనగర్‌లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్త స్రావమైందని చెప్పారు. సోమవారం ఆయన బ్రెయిన్‌డెడ్ అయినట్లు ధ్రువీకరించారు.
జీవన్‌దాన్ ట్రస్టుకు సమాచారం అందడంతో వారు అవయవదానం కోసం కుటుంబ సభ్యులను సంప్రదించారు. ‘మీ భర్త ప్రాణాలు తిరిగి రాకపోయినా.. మరికొందరిని రక్షించవచ్చని’ వారు చెప్పడంతో నర్సిరెడ్డి భార్య నిర్మల ఇందుకు అంగీకరించారు. ఆయన నుంచి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయం సేకరించారు. గుండెను ప్రత్యేకంగా మెట్రో రైలులో అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతున్న ఓ 44 ఏళ్ల వ్యక్తికి వైద్యులు అమర్చాలని నిర్ణయించారు. మిగతా అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా ఇతర ఆసుపత్రులకు తరలించిన విషయం తెలిసిందే.
Also Read: Coronavirus Telangana: తెలంగాణలో కొత్త కరోనా కేసులు 185… మొత్తం ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?