Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర కన్నుల పండువగా కొనసాగింది. అనంతరం హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనోత్సవం జరిగింది. బైబై గణేషా అంటూ అందరూ ఖైరతాబాద్ గణపతిని సాగనంపారు. ముందుగా పూజల అనంతరం ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర గురువారం ఉదయం 7గంటలకు ప్రారంభమైంది. గణపతి శోభాయాత్ర టెలిఫోన్ భవన్, సచివాలయం మీదుగా శోభాయాత్ర కొనసాగింది. అనంతరం ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజల అనంతరం ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం జరిగింది. వెల్డింగ్ పనులు పూర్తి చేసి.. ప్రత్యేక పూజల అనంతరం ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు. కాగా.. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాగా.. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్రకు చిన్నాపెద్ద తేడా లేకుండా.. లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. గణపతిబప్ప మోరియా.. ఖైరతాబాద్ గణేష్‌కు జై అంటూ డ్యాన్సులు వేస్తూ గణనాథుడ్ని సాగనంపారు. ఎటు చూసినా జనసంద్రమే.. ఇసుకేస్తే రాలనంత జనంతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిటకిటలాడాయి. ఖైరతాబాద్ గణేశ్ ఎదుట భక్తులతో పాటు.. పోలీసులు కూడా డ్యాన్స్ వేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఇదిలాఉంటే.. హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతోంది. హుస్సేన్‌సాగర్‌తో పాటు మొత్తం 100 ప్రాంతాల్లో నిమజ్జనం కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనుంది. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేందుకు 10వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వినాయక నిమజ్జనాలు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు కమిషనరేట్ల పరిధిలో 40వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేల 600 సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతోంది. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవడంతో పాటు.. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా గణేశ్ శోభాయాత్రల సందడి కనిపిస్తోంది. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్, కూకట్ పల్లి ఐడీఎల్ చెరువు దగ్గర వినాయక నిమజ్జనాలు భారీగా కొనసాగుతున్నాయి. ఇదిలాఉంటే.. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరవ్యాప్తంగా ట్రాఫిక్‌పై ఆంక్షలు పెట్టారు పోలీసులు. బాలాపూర్- హుస్సేన్ సాగర్ మార్గంలో సాధారణ వాహనాలపై రేపు ఉదయం పదిగంటల వరకు ఆంక్షలు విధించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..