ఆదివారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో 5281 మంది విద్యార్థుల పరిస్థితి చిత్రంగా మారింది. ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్‌టికెట్ నెంబర్ ఇవ్వని వారు, CBSE, ICSE పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి మార్కులు సేకరించకుండా JNTUH ఫలితాలు విడుదల చేసింది. దీంతో ఎంసెట్‌లో అర్హత సాధించినా.. ర్యాంకు ఎంత వచ్చిందో తెలియక ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 5281 మంది విద్యార్థులు అల్లాడుతున్నారు. వీరికి త్వరలోనే ర్యాంకులు ప్రకటిస్తామని ఎంసెట్ కన్వినర్ ప్రొఫెసర్ ఎస్. యాదయ్య తెలిపారు. అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌లు పంపించామని, ఆ వివరాలు అప్‌లోడ్ చేసిన తరువాత వాటిని తనిఖీ చేసి ర్యాంకులు ఇస్తామని ఆయన వెల్లడించారు.