Railway News Alert: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులు పొడగింపు

|

Aug 19, 2022 | 5:27 PM

Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా పలు ప్రత్యేక రైలు సర్వీసులను భారత రైల్వే శాఖ పొడగిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కూడా పలు ప్రత్యేక రైలు సర్వీసులను పొడగించింది.

Railway News Alert: రైల్వే ప్రయాణీకులకు అలెర్ట్.. ఆ మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులు పొడగింపు
Indian Railways
Follow us on

Railway News: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులను భారత రైల్వే శాఖ (Indian Railways) పొడగిస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పరిధిలో కూడా పలు ప్రత్యేక రైలు సర్వీసులను పొడగించారు. హైదరాబాద్ – జైపూర్ (Hyderabad – Jaipur) మధ్య నడుపుతున్న ప్రత్యేక రైలు సర్వీసులను పొడగిస్తున్నట్లు ద.మ.రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ – జైపూర్ (నెం.07115) ప్రత్యేక రైలును సెప్టెంబర్ 02 తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడగించారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తుంది. అలాగే జైపూర్ – హైదరాబాద్ (నెం.07116) ప్రత్యేక రైలును సెప్టెంబర్ 04 తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు పొడగించారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి ఆదివారం జైపూర్ నుంచి బయలుదేరి వెళ్తుంది.

సికింద్రాబాద్ – మదురై మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీసులను పొడగిస్తున్నట్లు ద.మ.రైల్వే ఇది వరకే ప్రకటించింది. సికింద్రాబాద్ – మదురై ప్రత్యేక రైలు నెం.07191ను సెప్టెంబర్ 26 తేదీ వరకు పొడగించారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి సోమవారం సికింద్రాబాద్ నుండి బయలుదేరి వెళ్తుంది. అలాగే మదురై – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నెం.07192ను సెప్టెంబర్ 28 తేదీ వరకు పొడగించారు. ఈ ప్రత్యేక రైలు ప్రతి బుధవారం మదురై నుంచి బయలుదేరి వెళ్తుంది.

ఇదిలా ఉండగా గతంలో రద్దు చేసిన వాస్కోడా గామా – జసిదిహ్ మధ్య ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వాస్కోడా గామా – జసిదిహ్ (నెం.17321) రైలును శుక్రవారం (19.08.2022) నుంచి పునరుద్ధరించగా.. జసిదిహ్ – వాస్కోడా గామా (నెం.17322) రైలును ఆగస్టు 22 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.

అటు తిరుపతి – సికింద్రాబాద్ మధ్య నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ.రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి – సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నెం.07481 ఈ నెల 21, 28 తేదీల్లో (ఆదివారం) రాత్రి 09.10 గం.లకు తిరుపతి నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 09.30 గం.లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ – తిరుపతి ప్రత్యేక రైలు నెం.07482 ఆగస్టు 22, 29 తేదీల్లో (సోమవారం) సాయంత్రం 04.15 గం.లకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.20 గం.లకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, మంత్రాలయం, రాయ్‌చూర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..