Postal: మీకు వచ్చిన పోస్ట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు.. 24 గంటల పాటు సేవలు.. పోస్టల్ శాఖ స్మార్ట్ ఆలోచన

పోస్టల్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు వేగవంతంగా సేవలు అందించేందుకు సాంకేతికను ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలో స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీని వల్ల పోస్టల్ సేవల్లో మరింత వేగం పెరగనుందని చెప్పవచ్చు.

Postal: మీకు వచ్చిన పోస్ట్ ఎప్పుడైనా తీసుకోవచ్చు.. 24 గంటల పాటు సేవలు.. పోస్టల్ శాఖ స్మార్ట్ ఆలోచన
Post

Updated on: Feb 06, 2026 | 8:44 AM

మీకు ఏదైనా పోస్ట్ వచ్చిందనున్నాం.. ఈ రోజుల్లో ఎక్కువగా బ్యాంకింగ్, ఆధార్, పాన్ కార్డ్, రవాణా శాఖకు సంబంధించిన కార్డులు పోస్ట్ ద్వారా ఇంటికి వస్తున్నాయి. మీకు ఏదైనా పోస్ట్ వచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్లను మీకు మాత్రమే పోస్టల్ శాఖ అందిస్తూ ఉంటుంది. మీరు లేకపోతే పోస్టల్ సిబ్బంది మీకు వచ్చిన డెలివరీని వెనక్కి తీసుకెళ్లతారు. కొన్ని రోజుల పాటు మీరు దానిని తీసుకోకపోతే పోస్టల్ శాఖ వెనక్కి పంపుతుంది. దీనికి చెక్ పెట్టేందుకు పోస్టల్ శాఖ సరికొత్త ఆలోచన చేసింది. ఇక నుంచి 24 గంటలు ఎప్పుడైనా మీరు వెళ్లి మీకు వచ్చిన డెలివరీని అందుకోవచ్చు. ఇందుకోసం సరికొత్త సాంకేతికను పోస్టల్ డిపార్ట్‌మెంట్ ప్రవేశపెట్టింది. ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త సదుపాయం కల్పిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా చూద్దాం.

డిజిటల్ లాకర్ సేవలు

త్వరలో పోస్టల్ శాఖ డిజిటల్ లాకర్ సేవలను ప్రారంభించనుంది. మీరు ఇంటి వద్ద లేనప్పుడు మీకు వచ్చిన పోస్ట్‌ను మీ ప్రాంతానికి సంబంధించిన పోస్టాఫీస్ వద్ద ఉండే డిజిలాకర్‌ మెషిన్‌లో వేస్తారు. 24 గంటల పాటు డిజిలాకర్ పనిచేస్తుంది. దీంతో మీరు ఎప్పుడైనా వెళ్లి దీని ద్వారా మీ డెలివరీని తీసుకోవచ్చు. ఇందుకోసం మీ పార్సిల్‌కు సంబంధించిన నెంబర్‌ను స్క్రీన్‌పై ఎంటర్ చేసి లాకర్ తెరుచుకుంటుంది. దీంతో మీకు వచ్చిన ఉత్తరం లేదా పార్శిల్‌ను నెంబర్ ఆధారంగా గుర్తించి మీరు తీసేసుకోవచ్చు. ఇప్పటివరకు మీరు ఇంటి వద్ద లేనప్పుడు పోస్టాఫీస్ సిబ్బందిని సంప్రదించి లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి పార్శిల్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇప్పటినుంచి పోస్టాఫీస్ పనివేళలతో సంబంధం లేకుండా మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు.

త్వరలో ఏర్పాటు

త్వరలోనే హైదరాబాద్ పరిధిలో ఆటోమేటెడ్ డిజిటల్ పార్సిల్ లాకర్లను ఏర్పాటు చేయనున్నట్లు పోస్టల్ శాఖ ప్రకటించింది. అనంతరం భవిష్యత్తులో అన్ని ప్రాంతాల్లో వీటిని ప్రవేశపెట్టే అవకాశముంది. దీని వల్ల ప్రజలకు వేగవంతంగా పోస్టల్ సేవలు అందుతాయి. ప్రస్తుతం రిసీవర్ ఇంట్లో లేనప్పుడు పోస్ట్ అందుకోవడానికి చాలా రోజుల పాటు సమయం పడుతుంది. వేరే ప్రాంతానికి వెళ్లి ఇంట్లో అందుబాటులో లేనప్పుడు కష్టమవుతుంది. త్వరలో రానున్న ఈ స్మార్ట్ విధానంతో పార్సిల్ డెలివరీల్లో మరింత వేగం పెరగనుంది. దీని వల్ల తపాలా సేవల కోసం గంటల కొద్ది వేచి ఉండాల్సిన శ్రమ కూడా తగ్గుతుంది. ఇక గతంలో పోస్ట్‌లు డెలివరీ చేయడానికి మూడు, నాలుగు రోజుల సమయం పట్టేది. కానీ ఇటీవల పోస్టల్ డిపార్ట్‌మెంట్ డాక్ సేవలను ప్రారంభించింది. దీని వల్ల ఒక్కరోజులోనే పార్సిళ్లను డెలివరీ చేస్తోంది.