TS Weather: కూల్ న్యూస్.. మండే ఎండల నుంచి రిలీఫ్.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

తెలంగాణకు ప్రజలకు కూల్ న్యూస్ వచ్చింది. హైదరాబాద్ నగరంలో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు రుతుపవనాలు గురించి కూడా అప్‌డేట్ వచ్చింది. తెలంగాణ వెదర్ రిపోర్ట్ ఇప్పుడు తెలుసుకుందాం...

TS Weather: కూల్ న్యూస్.. మండే ఎండల నుంచి రిలీఫ్.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
Telangana Weather

Updated on: May 31, 2024 | 5:05 PM

హైదరాబాద్ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు చెలరేగిపోవడంతో.. ఉదయం 10 తర్వాత బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఎండలు దంచి కొడుతున్న వేళ వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది.  నగరంలోని అన్ని మండలాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌ తెలిపింది. సిటీలో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. జూన్ 2న చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి తదితర మండలాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జూన్ 4 వరకు ఇతర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టిఎస్‌డిపిఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో గురువారం మంచిర్యాలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి. మంచిర్యాలలో 47.2 డిగ్రీలకు చేరుకోగా, భద్రాద్రి కొత్తగూడెంలో 47.1, ఖమ్మంలో 47 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌ సిటీ విషయానికి వస్తే… అంబర్‌పేటలో అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. IMD హైదరాబాద్ మూడు రోజుల వర్షపాతం అంచనా వేయడంతో… ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. కాగా రైతులు రుతుపవనాల రాక కోసం ఎదురుచూస్తున్నారు. వెదర్ డిపార్ట్‌మెంట్ అంచనా ప్రకారం జూన్ 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..