HYDRA 100 Days: ఆ విషయంలో తగ్గేదేలే.. 100 రోజుల్లో హైడ్రా ఎన్ని ఎకరాలను స్వాధీనం చేసుకుందో తెలుసా..?

|

Oct 26, 2024 | 3:42 PM

హైదరాబాద్‌లోని ఆక్రమణల తొలగింపు కోసం ఏర్పాటైన హైడ్రా 100 రోజులు పూర్తి చేసుకుంది. 310 అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో 144 ఎకరాల భూములను పరిరక్షించినప్పటికీ.. విమర్శలు, ఆరోపణలలు, వివాదాలు, న్యాయపోరాటాలు ఎదుర్కొంది. రాజకీయ ప్రభావం ఉన్న వారిపైనా చర్యలు తీసుకోవడంతో హైడ్రా చర్యలపై విమర్శలు, ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

HYDRA 100 Days: ఆ విషయంలో తగ్గేదేలే.. 100 రోజుల్లో హైడ్రా ఎన్ని ఎకరాలను స్వాధీనం చేసుకుందో తెలుసా..?
Hydra
Follow us on

హైడ్రా.. హండ్రెడ్‌ డెస్‌.. హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ ..హైడ్రా, ఏర్పడి నేటికి సరిగ్గా వంద రోజులు. విపత్తుల నివారణ, ఆస్తులు పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం గత జూలై 29న హైడ్రాను ఏర్పాటు చేస్తూ జీవో 99ను విడుదల చేసింది. హైడ్రా కమిషనర్‌గా ఐపీఎస్‌ రంగనాథ్‌ను నియమించింది. రేవంత్‌ సర్కార్‌ సంకల్పం మేరకు మహానగరంలో చెరువులు, కుంటల్లో భూఆక్రమణాల తొలగింపుపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. వంద రోజుల్లో 310 అక్రమ నిర్మాణాల కూల్చివేసింది. కబ్జాకు గురైన 144 ఎకరాల చెరువులు కుంటల భూముల్ని పరిరక్షించింది. ఇది హైడ్రా దూకుడుకు ప్రొగ్రెస్‌ రిపోర్ట్‌.

రెండో వైపు చూస్తే ఎన్నెన్నో విమర్శలు. వివాదాలను ఫేస్‌ చేసింది హైడ్రా. వస్తూ వస్తూనే మాదాపూర్‌ తమ్మిడి కుంట చెరువులో ఎన్‌ కన్వేషన్‌ కూల్చివేతతో హైడ్రా సంచలనం రేపింది. పేద,పెద్దా అనే తేడాలేకుండా చెరువులు, నాలాలు, కుంటాల్లోవెలిసిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ.. అక్రమార్కుల గుండెల్లో వణుకు రేపింది. హైడ్రా దూకుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థను పెట్టాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. మరోవైపు వివాదాలు, విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

రాజకీయ విమర్శలు ఎలా వున్నా ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా హైడ్రా దూకుడు ప్రదర్శించింది. అధికార పార్టీకి చెందిన పళ్లంరాజు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టంది. సీఎం రేవంత్‌ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు దుర్గంచెరువు బఫర్‌జోన్‌లో వున్నట్టు గుర్తించి నోటీసులు ఇవ్వడం సహా మార్కింగ్‌ చేసింది. ఖైరతాబాద్‌లో పార్క్‌ స్థలాన్ని ఆక్రమించిన షెడ్లను తొలగించి కాంపౌండ్‌ వాల్‌ నిర్మించింది. ఆ కాంపౌండ్‌ వాల్‌ను కూల్చిన వేసిన ఘటనలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సహా పలువురిపై కేసులు పెట్టింది హైడ్రా. అటు శివరాంపల్లిలోని కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించిన ఎంఐఎం ఎమ్మెల్యే ముబిన్తోపాటు ఇద్దరు కార్పొరేటర్లపై కేసులు ఫైలయ్యాయి. పాతబస్తీలో ఓవైసీ బ్రదర్స్ అక్రమ నిర్మాణాలను హైడ్రా గుర్తించటం అప్పట్లో ఓ సంచలనంగా మారింది. కానీ ఇప్పటి వరకు ఓవైసీ బ్రదర్స్ కు చెందిన అక్రమ నిర్మాణం ఒక్క ఇటుక కూడా కదలకపోవటం హైడ్రా పనితీరు ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. కూకట్ పల్లి సున్నం చెరువు భూముల్లో వెలిసిన గుడిసెల్ని తొలగించింది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారనే ఆందోళనలు భగ్గుమన్నాయి. హైడ్రాను రద్దు చేయాలనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ఇది కూడా చదవండి: ఇవి పిచ్చి ఆకులు కాదు దివ్యౌషధం.. రోజూ తింటే డయాబెటిస్‌కు ఛూమంత్రం వేసినట్లే..

సంగారెడ్డి జిల్లాలో భవనాల కూల్చివేతపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా దూకుడును ప్రశ్నించింది. తాము కూల్చలేదని కేవలం పరికరాలు సమకూర్చామన్న హైడ్రా సమాధానంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చార్మినార్‌ తహశీల్దార్‌ అడిగాడని కోర్టు భవనాలను కూల్చడానికి పరికరాలు సమకూరాస్తారా? అని ఘాటుగా ప్రశ్నించింది.

మరోవైపు మూసీ మిషన్‌ హైడ్రాపై విమర్శలకు,వివాదాలకు మరింత ఆజ్యం పోసింది. మూసీ పరివాహాక ప్రాంతంలో మార్కింగ్‌కు హైడ్రాకు సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రా దూకుడుకు కాస్త బ్రేక్‌ పడింది. అనుమతులు వున్న నిర్మాణాలను కూల్చమన్న హైడ్రా… దురాక్రమణలను మాత్రం వదలమని స్పష్టం చేసింది ఇప్పుడు చెరువుల పునరుజ్జీవం పై దృష్టిసారించింది హైడ్రా .. వ్యర్థాల తొలగింపును ముమ్మరం చేస్తోంది.

హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ..హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని ఇటీవల స్ఫష్టం చేసింది. ఐతే వంద రోజుల వేళ హైడ్రాపైకి మరో యార్కర్‌ దూసుకు వచ్చింది. హైడ్రా ఆర్డినెన్స్‌ చట్ట విరుద్ధమని తెలంగాణ హైకోర్టులో మరో పిల్‌ దాఖలైంది. హైడ్రాకు విస్తృత అధికారులు ఇవ్వడం చట్టవిరుద్దమని మాజీ కార్పొరేటర్‌ మంచిరెడ్డి ప్రశాంత్‌ రెడ్డి వేసిన పిల్‌పై కోర్టు విచారణ చేపట్టింది. 3 వారాల్లో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ సీఎస్‌ సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఇదీ హైడ్రా హండ్రెడస్‌ రిపోర్ట్‌. ఇక వాట్‌ నెక్ట్స్‌.. వేచి చూడాల్సిందే.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..