శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దక్షిణాది పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితం ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో హకీంపేటకు వచ్చిన ఆయనకు.. గవర్నర్ తమిళసై, సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రులు సాదరస్వాగతం పలికారు. అయితే ఆయన వచ్చే సమయానికి హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ సెంటర్‌లో ఓ లారీ ఆగిపోయింది. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు కొంతమేర వరకు దాన్ని నెట్టుకుంటూ వెళ్లిపోయారు. రాష్ట్రపతి రాకకు కొన్ని నిమిషాల ముందు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కాగా 21,22 తేదీల్లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేయనున్నారు. ఆ తరువాత 23న పుదుచ్చేరి, 25న కన్యాకుమారి వెళ్లి అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న కోవింద్.. 27న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అదే రోజు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందుకు నిర్వహించనున్న రాష్ట్రపతి.. 28న మధ్యాహ్నం హకీంపేట నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు.