వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే.. బండి డైరెక్టుగా..
నకిలీ, ట్యాంపరింగ్ చేసిన లేదా నిబంధనలకు విరుద్ధమైన నంబర్ ప్లేట్లతో తిరిగే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా గత వారంలో 6 క్రిమినల్ కేసులు నమోదు చేసి పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. HSRP నంబర్ ప్లేట్లు మాత్రమే ఉపయోగించాలని పోలీసులు స్పష్టం చేశారు. నంబర్ ప్లేట్ మార్చడం, నంబర్లు కనిపించకుండా చేయడం లేదా అనధికారిక ప్లేట్లు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

నకిలీ నంబర్ ప్లేట్లతో తిరిగే వాహనాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి.. క్రిమినల్ కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపించనున్నట్లు తెలిపారు. నకిలీ, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నంబర్ ప్లేట్లపై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. నకిలీ, ట్యాంపరింగ్ చేసిన లేదా అనధికారిక రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ఉపయోగిస్తున్న వాహనాలపై ప్రత్యేక తనిఖీలను తీవ్రతరం చేశారు. ఇటువంటి ఉల్లంఘనలు మోటారు వాహనాల చట్టం, ఇతర సంబంధిత చట్టపరమైన నిబంధనలకు తీవ్ర విరుద్ధమని తెలిపారు.
ఈ ప్రత్యేక తనిఖీలలో భాగంగా, వాహనాల గుర్తింపును దాచడం, ట్రాఫిక్ చలానాల నుండి తప్పించుకోవడం, నిబంధనలను ఉల్లంఘించేందుకు నకిలీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగిస్తున్న వారిపై గత వారంలో ఆరు (06) క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ప్రకటనలో తెలిపారు. ఆపరేషన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
వివిధ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు:
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్, షాలీబండ పోలీస్ స్టేషన్, బండ్లగూడ పోలీస్ స్టేషన్,గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్,వనస్థలిపురం పోలీస్ స్టేషన్ (మల్కాజ్‌గిరి కమిషనరేట్) పరిధిలో ఆరు కేసులు నమోదయ్యాయని.. వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
కచ్చితంగా హెచ్‌ఎస్‌ఆర్‌పి (HSRP) నంబర్ ప్లేట్లే ఉండాలి:
ప్రభుత్వం ఆమోదించిన హై-సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) మాత్రమే చట్టబద్ధంగా అనుమతించబడతాయని… సొంతంగా నంబర్ ప్లేట్లలో మార్పులు చేయడం, నంబర్లు కనిపించకుండా చేయడం లేదా తాత్కాలిక స్టిక్కర్లను ఉపయోగించడం ముమ్మాటికీ చట్టవిరుద్ధమని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
జీరో టాలరెన్స్ హెచ్చరిక:
నకిలీ వాహన రిజిస్ట్రేషన్ విధానాలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ‘జీరో టాలరెన్స్’ (సహించేది లేదు) విధానాన్ని పునరుద్ఘాటిస్తున్నారు. నకిలీ లేదా ట్యాంపరింగ్ చేసిన రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఉపయోగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాన్ని తక్షణమే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
ప్రజా భద్రత, చట్టబద్ధమైన రోడ్డు వినియోగం, నేరాల నివారణను నిర్ధారించడానికి నగరవ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం, క్రమబద్ధంగా, కఠినంగా కొనసాగుతాయని ట్రాఫిక్ విభాగం స్పష్టం చేసింది. వాహనదారులందరూ కచ్చితంగా నంబర్ ప్లేట్ నిబంధనలు, ట్రాఫిక్ నియమాలను పాటించాలని హైదరాబాద్ సిటీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
