Terror Alert: ఇంకెంతమంది ఉన్నారో.. తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్.. ఆపరేషన్‌ స్లీపర్‌ సెల్స్‌ షురూ..

తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్‌ స్లీపర్‌ సెల్స్‌ షురూ అయింది. హై అలర్ట్‌ ప్రకటించిన పోలీసులు.. అండర్‌గ్రౌండ్‌లో నక్కి ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు. స్లీపర్‌ సెల్స్‌కు స్లీప్‌ లేకుండా చేసేందుకు స్పెషల్‌ టీమ్స్‌ రంగంలోకి దిగాయి. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి..

Terror Alert: ఇంకెంతమంది ఉన్నారో.. తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్.. ఆపరేషన్‌ స్లీపర్‌ సెల్స్‌ షురూ..
Sleeper Cells Operation

Updated on: May 24, 2025 | 8:47 AM

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్‌ సింధూర్‌తో.. దేశంలో ఉగ్రవాదులను ఏరి పారేస్తున్నాయి భద్రతా దళాలు. తెలుగు రాష్ట్రాల్లో కూడా టెర్రరిస్టుల స్లీపర్‌ సెల్స్‌పై దృష్టి సారించారు పోలీసులు. ఆపరేషన్‌ స్లీపర్‌ సెల్‌ పేరుతో ఉగ్రమూకల వేట షురూ అయింది. ఈ నేపథ్యంలో…విశ్వనగరం హైదరాబాద్‌లో ఉగ్ర జాడలు కనిపించడం కలకలం రేపుతోంది. కలవరం కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్‌ బోయగూడలో ఉగ్రవాద ఆనవాళ్లు బయటపడం ఆందోళన కలిగిస్తోంది. నిత్యం తమ మధ్యే ఉండే యువకుడు బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలియగానే బస్తీవాసులు ఆందోళనకు గురయ్యారు. విజయనగరంలో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్‌ కోసం సరంజామా అంతా సిద్ధం చేసిన అక్కడి యువకుడు సిరాజ్, బోయగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును NIA డీల్ చేస్తోంది.

ఆరంభంలోనే ఉగ్ర కుట్ర విచ్ఛిన్నం.. స్లీపర్‌ సెల్స్‌ను గుర్తించే పనిలో పోలీసులు..

ఇక లేటెస్టుగా తెలంగాణ డీజీపీ జితేందర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్.. హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ఉన్నాయా అన్న అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్‌లో స్లీపర్‌ సెల్స్‌ను గుర్తిస్తున్నామని, వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని డీజీపీ చెప్పారు. నగరంలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పూర్తి అలర్ట్‌గా ఉన్నాయన్నారు పోలీస్‌ బాస్‌. నిఘా వర్గాల హెచ్చరికలతో స్లీపర్ సెల్స్ కదలికలపై ఆరా తీస్తున్నామన్నారు ఆయన. ఇక స్లీపర్‌ సెల్స్‌ జాడ పసిగట్టి, వాళ్ల పని పట్టేందుకు స్పెషల్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఉగ్రవాదుల కదలికలను ముందుగానే గమనించి అనేక మంది నిందితులను అరెస్టు చేశామని డీజీపీ తెలిపారు. ఇక సమీర్, సిరాజ్‌లు.. ఉగ్రకుట్రకు ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారని, ఏర్పాటు దశలోనే గ్రూపును కనిపెట్టి విచ్ఛిన్నం చేశామన్నారు డీజీపీ జితేందర్‌.

చాప కింద నీరులా పనిచేసే స్లీపర్‌ సెల్స్‌

టెర్రర్‌ స్లీపర్ సెల్స్ అనేవి, జనం మధ్య గుట్టుచప్పుడు కాకుండా పనిచేసే ఉగ్రవాదుల గ్రూపులు లేదా ఉగ్రవాద సానుభూతి పరులు. వీళ్లు చాప కింద నీరులా పనిచేస్తారు. టెర్రర్‌ గ్రూపు కమాండర్లు ఆదేశించిన వెంటనే, ఈ స్లీపర్‌ సెల్స్‌ యాక్టివేట్‌ అవుతాయి. వీళ్లు గోప్యంగా పనిచేస్తూ, నిఘా వ్యవస్థల కంట పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. స్లీపర్ సెల్స్‌పై నిఘా ఉంచడం ద్వారా, హైదరాబాద్ నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచుతున్నారు. నగరంలో టెర్రరిస్టు స్లీపర్‌ సెల్స్ పడగ విప్పేందుకు ప్రయత్నిస్తే..వాళ్ల పని పట్టేందుకు, ముందుగానే వాళ్ల ఖేల్‌ ఖతమ్‌ చేసేందుకు పోలీస్‌ యాక్షన్‌ స్టార్ట్‌ అయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..