Weather Report : గత మూడు రోజులుగా వాతావరణం మబ్బులు పట్టి ఉంటుంది. చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో రాబోయే 24 గంటల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఉరుములు పడతాయని పేర్కొంది. భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ప్రకారం.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని, రాబోయే రెండు రోజుల్లో నగరంలో వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మితమైన వర్షాలు కురిసే జిల్లాలు హైదరాబాద్, రంగా రెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నారాయణపేట, మహబూనగర్. అంతేకాకుండా కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడే అవకాశం ఉందని తెలిపింది.
అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పలుచోట్ల వచ్చే 72 గంటల్లో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నాలుగైదు రోజుల్లో భారీ వర్షాలు పడటానికి ఆస్కారం ఉంది. మధ్యప్రదేశ్, తీర ప్రాంతం (కొమొరిన్ ఏరియా)లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం వల్ల కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతవరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ తుఫాన్ తరహా వాతావరణం, అల్పపీడన ద్రోణి ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు.
దక్షిణాదిలో పలుచోట్ల తేలికపాటి జల్లులు పడొచ్చని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి కేరళ, కర్ణాటక, తెలంగాణల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని అన్నారు. కేరళ, కర్ణాటకల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. అలాగే- పశ్చిమ రాష్ట్రాల్లో వేడి గాలుల తీవ్రత కొనసాగుతుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు ఆనుకుని, మధ్యప్రదేశ్ గగనతలంపై సైక్లోనిక్ సర్కులేషన్ ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఇది మరింత విస్తరించే అవకాశం ఉందని అంచనా వేశారు. దీని ప్రభావంతో కేరళలో సోమవారం నాడు 80 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.