Ex MLA Shakeel Son Escape: ప్రజాభవన్ దగ్గర కారు బీభత్సం.. వేగంగా దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సొహైల్ కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, ఉద్దేశపూర్వకంగా కేసును తప్పుదోవ పట్టిస్తూ మరో వ్యక్తిని ఇరికించారన్నారు వెస్ట్‌జోన్ డీసీపీ విజయకుమార్.
కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది ఎవరు? అందుకు సహకరించింది ఎవరెవరు? ఈ పాయింట్ కేంద్రంగా కొత్త ట్విస్టులు క్యూ కట్టాయి. యాక్సిడెంట్ తరువాత సోహైల్‌ను పంజాగుట్ట ఠానాకు తరలించారు కానిస్టేబుల్స్. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఠానాలో ఏ మంత్రాంగం జరిగిందో ఏమో కానీ సోహైల్ బదులు షకీల్ ఇంట్లో పని మనిషిని కేసులో చేర్చారు పోలీసులు. ఈ వ్యవహారంపైన సీఐ, నైట్ డ్యూటీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ పాత్రపై దర్యాప్తు చేపట్టారు పోలీస్ అధికారులు. అలాగే సోహైల్ తో రాత్రి కాల్స్ మాట్లాడిన అతని ఫ్రెండ్స్‌ను కూడా ప్రశ్నించారు.
గతంలోనూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్న కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వైపు నుంచి మహేంద్రా థార్ కారు జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వైపు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ కేసులోనూ ఛార్జ్‌షీట్ కూడా వేశామన్నారు వెస్ట్‌జోన్ డీసీపీ విజయ్‌కుమార్. చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు
ప్రజాభవన్ దగ్గర జరిగిన యాక్సిడెంట్ కేసును తప్పుదోవ పట్టించడంలో ఎవరి పాత్ర ఏంటి? అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..