సోషల్ సర్వీస్ సెంటర్లుగా మసీదులు..పెళ్లిళ్లను మసీదులో జరిపించి వారి ఖర్చు తగ్గించాలి!

| Edited By: Janardhan Veluru

Feb 21, 2022 | 5:07 PM

సామాజిక సేవా కార్యక్రమాలకోసం మసీదులను తీర్చిదిద్దడంపై జమాఅతె ఇస్లామీహింద్ గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఫోకస్‌ పెట్టింది..

సోషల్ సర్వీస్ సెంటర్లుగా మసీదులు..పెళ్లిళ్లను మసీదులో జరిపించి వారి ఖర్చు తగ్గించాలి!
Masjid Community Center
Follow us on

సామాజిక సేవా కార్యక్రమాలకోసం మసీదులను తీర్చిదిద్దడంపై జమాఅతె ఇస్లామీహింద్ గ్రేటర్ హైదరాబాద్ శాఖ ఫోకస్‌ పెట్టింది. అందుకోసం నగరంలోని మసీదు కమిటీల అధ్యక్షులు సదర్ సెక్రటరీలతో సమావేశమైంది. ఆ సంస్థ సిటీ ప్రెసిడెంట్ హాఫిజ్ ముహమ్మద్ రషాదుద్దీన్ ఈ విషయాన్ని వారందరితో చర్చించారు. ప్రవక్త కాలంలో మసీదును రోజూ ఐదు పూటలా నమాజు ఆచరించడానికి మాత్రమే పరిమితం చేయలేదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్త తొలిసారిగా నిర్మించిన మదీనా మసీదు కేంద్రంగా ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వయోజన పాఠశాలను నిర్వహించారని, రోగులకు చికిత్స అందించే వారని, అక్కడ ఎన్నో వివాదాలకు పరిష్కారం దొరికేదని ఆయన అన్నారు. ఆ స్ఫూర్తితోనే మసీదులో ఇప్పటికీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అన్నారు. పెళ్లిళ్లను మసీదులో జరిపించి ఆడపిల్లల తల్లిదండ్రుల ఖర్చు తగ్గించాలని, కుటుంబ తగాదాలకు పులిస్టాప్ పడేలా.. మసీదులు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లకు కేంద్రం కావాలన్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించే సోషల్ సర్వీస్ సెంటర్ స్థాపించాలి. పేద పిల్లలకు చదువులు చెప్పే విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. రోగులకు వైద్యమందించి స్వస్థత చేకూర్చే క్లినిక్‌లు ఏర్పాటు చేయాలి. ధార్మిక శిక్షణ పాఠశాలలుగా మసీదులను తీర్చిదిద్దాలని అన్నారు. మసీదు కేంద్రంగా సామాజిక సేవ విస్తృతంగా చేయాలని ముహమ్మద్ రషాదుద్దీన్ అన్నారు.

ఇప్పటికే కోవిడ్ కల్లోలంలో దేశంలోని పలు మసీదులు కోవిడ్ కేర్ సెంటర్లుగా, ఐసోలేషన్ సెంటర్లుగా సేవలందించాయి. అంతేకాకుండా పలు మసీదుల్లో వైద్య శాలలు నిర్వహిస్తున్నారు. ముంబయి, బెంగళూరు తదితర నగరాల్లోని కొన్ని మసీదుల్లో రోజూ అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని సుమారు పాతిక మసీదుల్లో ఈవినింగ్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఓ మసీదులో అయితే హెల్పింగ్ హేండ్ ఫౌండేషన్ వారు ఏకంగా ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పాటు చేసి మైనర్ సర్జరీలు చేస్తున్నారు. ఏదిఏమైనా మసీదులను సామాజిక సేవ కేంద్రాలుగా మలచాలన్న ఉద్దేశం మంచిదేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశానికి ప్రముఖులైన ఉలమాలు హాజరయ్యారు. సమాజంలో మసీదు పాత్ర ఎలా ఉండాలనే విషయాన్ని ఉలమాలు వివరించారు.

-నూర్ మహమ్మద్, TV9 Telugu, హైదరాబాద్

Also Read:

Attention: GATE 2022 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే..