Minister Harishrao: రాష్ట్రమంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు, పార్లమెంటు సభ్యులు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. శివారు ప్రాంతం శంషాబాద్‌లోని కొత్తగా నిర్మించిన ఆర్క్యన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. హాస్పిటల్ ఓపెనింగ్ తర్వాత నేతలందరూ తిరుగు పయనమయ్యారు. ఇంతలో కొత్తగా నిర్మించిన లిఫ్ట్ కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్ లో ప్రజాప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, నేతలు కాకుండా ఇతర కార్యకర్తలు అందులో ఉంగా ప్రమాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ లోడ్ ఎక్కువ కావడంతో లిఫ్ట్ కుప్పకూలింది.
వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక సిబ్బంది సాయంతో లిఫ్ట్ ను తెరిచి, అందులో చిక్కుకున్న వారిని బయటికి తీసుకొచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు. వారికి అదే ఆసుపత్రిలో చికిత్స అందించి పంపించామని వెల్లడించారు.