
Metro Lockers: హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం కొత్తగా అనేక సదుపాయాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రయాణికుల అసవరాలకు అనుగుణంగా సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా తాజాగా మరో కొత్త సేవలను ప్రారంభించింది. మెట్రో స్టేషన్లలో స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం టక్కీట్ సంస్ధతో మెట్రో అధికారులు భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. శుక్రవారం నగరంలోని ఏడు మెట్రో స్టేషన్లలో ఆన్-డిమాండ్ స్మార్ట్ స్టోరేజ్ లాకర్లను ప్రారంభించారు. ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో మెట్రో అధికారులు పాల్గొని వీటికి ప్రారంభోత్సవం చేశారు. దశలవారీగా మిగతా అన్నీ మెట్రో స్టేషన్లల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో ఇది మరో కీలక అడుగుగా మెట్రో వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మియాపూర్, అమీర్‌పేట్, పంజాగుట్ట,ఎల్బీనగర్, ఉప్పల్, పరేడ్ గ్రౌండ్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లలో ఈ స్మార్ట్ లాకర్లను ప్రవేశపెట్టారు. టెక్నాలజీ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. హెల్మెట్లు, షాపింగ్ బ్యాగులు, బ్యాక్‌ప్యాక్‌లు , ఇతర వ్యక్తిగత వస్తువులను ప్రయాణికులు సురక్షితంగా భద్రపర్చుకోవచ్చు. ప్రయాణికులు మూడు సులభమైన దశల ద్వారా 30 సెకన్లలోపు ఈ స్మార్ట్ లాకర్లను ఓపెన్ చేయవచ్చు.
-లాకర్ ప్యానెల్‌లో ఉండే QR కోడ్‌ను స్కాన్ చేయాలి
-మీ వస్తువుల ఆధారంగా లాకార్ల పరిమాణాన్ని ఎంచుకోండి
-ఎంతకాలం వ్యవధికి ఉపయోగించుకుంటున్నారనేది సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేయాలి
ఈ లాకర్ల సదుపాయంపై మెట్రో ఎండీ కెవిబి రెడ్డి మాట్లాడుతూ.. “టక్కీట్ సంస్థతో భాగస్వామ్యమై టెక్నాలజీతో కూడిన స్మార్ట్ లాకర్లను అందుబాటులోకి తెచ్చాం. ప్రయాణికులు తమ సామాన్లను సురక్షితంగా భద్రపర్చుకోవడానికి ఇవి చాలా ప్రయోజనకంగా ఉంటాయి” అని అన్నారు. ఇక టక్కీట్ వ్యవస్థాపకుడు రాజేష్ అమర్‌లాల్ మాట్లాడుతూ.. “మెట్రో భాగస్వామ్యంతో మా ‘స్కాన్ & స్టోర్’ లాకర్లను వేగంగా విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రయాణికులకు అవసరమైన చోట అందుబాటులో ఉండటమే మా లక్ష్యం” అని అన్నారు.