
హైదరాబాద్ వాసులకు మెట్రో అధికారులు మరో గుడ్‌న్యూస్ అందించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో పీక్ అవర్స్‌లో భారీగా రద్దీ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రద్దీ బాగా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సమయాల్లో కనీసం నిల్చోని ప్రయాణించడానికి కూడా కుదరడం లేదు. దీంతో తర్వాత వచ్చే రైలు కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల డిమాండ్ పెరుగుతున్న కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్(HMRL) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మెట్రో రైళ్లల్లో మూడు కోచ్‌లు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలో ఆరు కోచ్‌లు ఉండే రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది.
తొలుత ఆరు కోచ్‌లు ఉండే 10 కొత్త రైళ్లను కొనుగోలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే టెండర్లను ఆహ్వానించనున్నారు. ఈ ఆరు కోచ్‌ల రైళ్లు అందుబాటాటులో వస్తే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్స్‌పై తర్వాతి రైలు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎక్కువమందికి ట్రైన్లలో సీట్లు దొరుకుతాయి. దీని వల్ల నిల్చోని ప్రయాణం చేసే ఇబ్బంది ఉండదు. దీని వల్ల ప్రయాణికుల రద్దీని నివారించడమే కాకుండా సౌకర్యంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. గతంలోనే ఆరు కోచ్‌ల మెట్రో రైళ్లను కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ.. వివిధ కారణాల వల్ల ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది.
త్వరలో హైదరాబాద్ మెట్రోను ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. నష్టాలతో మెట్రోను నడపలేమని ఎల్‌అండ్‌టీ ప్రభుత్వానికి తెలిపింది. దీంతో మెట్రోను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇక నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెట్రో నిర్వహణ ఉండనుంది. ఇప్పటికే స్వాధీన ప్రక్రియను వేగవంతం చేశారు. మెట్రో ఆస్తులను ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రాసెస్ జరుగుతోంది. మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ఆర్ధికపరంగా, న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెట్రోను స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. అందుకే పలు కన్సల్టెన్సీలకు ఈ బాధ్యతలను అప్పగించింది.