Hyderabad News: హైదరాబాద్‌లోని మణికొండ ఏరియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మణికొండ గోల్డెన్ టెంపుల్ ముందు ఓపెన్ డ్రైనేజీలో ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి కోసం అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియలేదని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండ గోల్డెన్ టెంపుల్ ముందు డ్రైనేజీ వర్కర్ నడుస్తోంది. శనివారం సాయంత్రం నాలా వర్క్ చేసిన తర్వాత అక్కడ చిన్న సైన్ బోర్డులు తప్ప.. ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. అయితే వర్షం ధాటికి సైన్ బోర్డులు కొట్టుకుపోవడంతో ఓపెన్ డ్రైనేజీని పాదాచారులు గమనించలేదు. ఇంతలోనే ఓ వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ఆ నాలాలో పడి గల్లంతయ్యాడు.
నాలా ముందున్న ఇంట్లో శ్రీనివాసాచారి అనే వ్యక్తి ఆ సమయంలో వీడియో తీస్తుండడంతో అసలు విషయం బయటపడింది. వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు ఈ సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, డీఆర్‌ఎఫ్, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. మణికొండ మున్సిపల్ కమిషనర్ జయంత్ మాత్రం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. వర్షం రావడం వల్ల మట్టి కొట్టుకుపోయి నాలా ఉన్నట్లు ఎవరికీ తెలియలేదన్నారు. అయితే స్థానికులు మాత్రం అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమంటున్నారు. ఎలాంటి సైన్ బోర్డులు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. 3 నెలల నుంచి వర్క్ జరుగుతోందని.. ఈరోజు వరకు ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదని అధికారులు చెబుతున్నారు. ఆ వ్యక్తిని కనిపెట్టేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.
Also read: