హైదరాబాద్, ఆగస్టు 28: నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జిహెచ్ఎంసి కార్మికురాలిగా పనిచేస్తున్నటువంటి సునీత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం విధుల్లో భాగంగా తెల్లవారుజామున 5 గంటలకు ఎప్పటిలానే ఆమె కేటాయించిన ప్రాంతంలో విధులు నిర్వర్తించుకునేందుకు కింగ్ కోటిలోని బొగ్గులకుంట ప్రాంతానికి చేరుకుంది.. అక్కడ రోడ్డు శుభ్రం చేస్తున్నటువంటి సమయంలో అతివేగంగా వచ్చినటువంటి అయాన్ ఇన్స్టిట్యూట్ మెడికల్ కాలేజీ బస్సు బలంగా సునీతను ఢీ కొట్టింది. ఓ చెట్టు దగ్గర చెత్తను కుప్ప చేస్తున్నటువంటి సమయంలో అతివేగంగా.. దూసుకొచ్చిన కాలేజీ బస్సు ఒక్కసారిగా సునీతను ఢీకొట్టింది.. దీంతో సునీత చెట్టుకు బస్సుకు మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయాల పాలయ్యింది. అనంతరం ఆ చుట్టుపక్కల పనిచేస్తున్నటువంటి తోటి కార్మికులు కేకలు వేసుకుంటూ సునీత వద్దకు వచ్చారు. అప్పటికే బస్సులో ఉన్న డ్రైవర్ను కార్మికులంతా కలిసి చుట్టుముట్టారు. అనంతరం బస్ డ్రైవర్ ను పోలీసులకు అప్పచెప్పారు. ఆ సమయంలో బస్సులో 20 నుంచి 30 మంది విద్యార్థుల వరకు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణం అని ఘటన స్థలంలో ప్రత్యక్షంగా చూసినటువంటి తోటి కార్మికులు చెప్తున్నారు. తెల్లవారుజామున రోడ్లమీద బిక్కుబిక్కుమంటూ పనులు చెయ్యాలి అంటే భయమేస్తుంది అంటూ కార్మికులు ఆందోళన చెందుతున్నారు. తోటి కార్మికురాలు సునీత కుటుంబానికి ప్రభుత్వం సాయం చేయాలని వేడుకున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి డిప్యూటీ కమిషనర్.. సునీత కుటుంబంలోని మరొక వ్యక్తికి ఈ ఉద్యోగాన్ని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. తెల్లవారుజామున వాహనదారులు రోడ్లమీద జాగ్రత్తగా వెహికిల్స్ నడపాలని.. అదే సమయంలో స్కూల్స్, కాలేజీలు బస్సులు నడిపేవాళ్లు ఇంకా జాగ్రత్తలు పాటించాలి సూచించారు. పూర్తి ఫిటెనెస్, సేఫ్టీ మెజర్స్ వాహనాల్లో ఉండాలని.. అలాగే వాటిని నడిపే డ్రైవర్స్ సైతం నిష్ణాతులై ఉండాలని సూచించారు.
మరోవైపు తెల్లవారుజామున రోడ్లపై క్లీన్ చేసేందుకు వచ్చే జిహెచ్ఎంసి కార్మికుల సైతం వాహనదారులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేయాల్సిందిగా తోటి కార్మికులతో సహా అధికారులు సూచిస్తున్నారు.. అయితే సీసీ కెమెరాల్లో రికార్డు అయినటువంటి ఈ రోడ్డు ప్రమాదపు దృశ్యాలు అందరినీ భయాందోళన గురిచేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..