నగరంలో క్రైమ్ రేటు రోజురోజుకు పెరిగిపోతుంది. నడిరోడ్డుపైనే హత్యకు తెగబడుతున్నారు కొందరు. కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోతున్నారు. దొరికిన వాడిని దొరికిన చోట అత్యంత దారుణంగా హత్య చేస్తున్నటువంటి ఘటనలు తరచూ ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. దీంతో రోడ్లమీద వెళ్ళేటటువంటి పబ్లిక్ తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.. కళ్ళముందే ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేస్తున్నా.. పబ్లిక్ భయంలో ఏం చేయలేని పరిస్థితి ఉంది. తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. దాసరం బస్తీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తరుణ్ అనే యువకుడు మరి కొంతమంది స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అందులో షరీఫ్ అనే ఒక రౌడీషీటర్ తో మృతుడు తరుణ్ తో గొడవ అయినట్లు సమాచారం. ఆ గొడవ కాస్త మితిమీరడంతో హత్యకు దారితీసింది. తరుణ్ ను అత్యంత దారుణంగా బండరాయితో మోది హత్య చేశాడు షరీఫ్.
ఘటనను చూసిన కొంతమంది స్థానికులు భయభ్రాంతులకు గురై అరవడంతో అక్కడినుండి దుండగలు పరారయ్యారు. స్థానికులు 100 కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో.. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు.. తరుణ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం నిందితుడు షరీఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేవలం షరీఫ్ మాత్రమే హత్య చేశాడా.. అతనికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జనావాసాల మధ్య ఇలాంటి దారుణ హత్యలు జరగడంతో స్థానికంగా నివసించేటటువంటి వారు భయాందోళనకు గురి అవుతున్నారు. అల్లరి మూకలు, రౌడీ షీటర్స్, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…