Hyderabad Drugs Case: గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు హైదరాబాద్ పోలీసులు.. కాగా.. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పట్టుబడిన తర్వాత.. తవ్వినకొద్దీ కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో ఇదే హోటల్లో పనిచేసిన సయ్యద్ అబ్బాస్.. డ్రగ్స్ సప్లయిర్‌గా మారాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త వివేకానందకు అబ్బాస్, ఒకటీరెండు కాదు, ఏకంగా పదిసార్లు డ్రగ్స్ సప్లై చేశాడట. ఇలా విచ్చలవిడిగా వచ్చిన డ్రగ్స్‌తోనే రాడిసన్ హోటల్లో ప్రముఖులకు విందు ఇచ్చేవాడు వివేకానంద. నిందితుల కాల్‌డేటా చూస్తే ప్రముఖుల చిట్టా బయటపడింది. అంతేకాదు.. డ్రగ్స్ పార్టీ జరిగిన రోజు డైరెక్టర్ క్రిష్ కూడా హాజరయ్యారు. అరగంటపాటు ఆయన అక్కడే ఉన్నారు. ఈ అరగంటలో ఏం చేశారు. డ్రగ్స్ వాడారా లేదా. ఇది తేల్చడానికే విచారణకు రావాలని పోలీసులు నోటీసులిచ్చారు. డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్ పేరును FIRలో చేర్చారు..అయితే ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆయన డుమ్మాకొట్టారు.. విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు. అయితే క్రిష్‌తోపాటు.. లిషి గణేశ్ పేర్లు వెలుగులోకి రావడంతో.. తాజా ఘటన మరోసారి టాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది
ఇక ఈ కేసులో మొత్తం పది మంది ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్ స్పష్టం చేస్తుండగా.. వివేకానంద, అతనికి డ్రగ్స్ సరఫరా చేసే అబ్బాస్, కేదార్, నిర్భయ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల నంబర్స్ ఉన్నాయి. రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో అబ్బాస్ అలీతో పలువురు చాటింగ్ చేశారని పోలీసులు గుర్తించారు. రాడిసన్ హోటల్‌లో గజ్జల వివేకానంద్‌కు 10 సార్లు డ్రగ్స్ సప్లయ్ చేసినట్లుగా అతడు తన వాంగ్మూలంలో చెప్పారు. ఈ పది పార్టీలకు పెద్ద పెద్ద ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం పది మందిపై పోలీసులు FIR నమోదు చేశారు. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అటు రాడిసన్ హోటల్‌లో సీసీ ఫుటేజ్‌ని డిలీట్ చేశారు హోటల్ నిర్వాహకులు..దీనిపై కూడా హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు.. ఈ క్రమంలో బుధవారం డ్రగ్స్ సప్లయర్ సయ్యద్ అబ్బాస్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
అయితే, రాడిసన్ హోటల్‌లో 200 సీసీ కెమెరాలు ఉన్నా.. 16 మాత్రమే పనిచేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసం సీసీ కెమెరాలు మాయం చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..