Consumer Forum: డెలివరీ సమయంలో పార్శిల్ ట్యాంపరింగ్.. పోస్టల్ శాఖకు రూ.20 వేల ఫైన్..

|

Oct 02, 2023 | 12:12 PM

పోస్టల్ శాఖకు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. ఓ పార్శిల్ తారుమారు చేయడంతోపాటు దానిలోని వస్తువులను మిస్ చేసిన ఘటనను విచారించిన వినియోగదారుల ఫోరం కోర్టు.. పోస్టల్ శాఖకు ఫైన్ విధించింది. కస్టమర్‌కు రూ.20 వేల పరిహారం చెల్లించాలని ఇండియా పోస్ట్‌ను ఆదేశించింది.

Consumer Forum: డెలివరీ సమయంలో పార్శిల్ ట్యాంపరింగ్.. పోస్టల్ శాఖకు రూ.20 వేల ఫైన్..
Parcel
Follow us on

పోస్టల్ శాఖకు హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల ఫోరం షాకిచ్చింది. ఓ పార్శిల్ తారుమారు చేయడంతోపాటు దానిలోని వస్తువులను మిస్ చేసిన ఘటనను విచారించిన వినియోగదారుల ఫోరం కోర్టు.. పోస్టల్ శాఖకు ఫైన్ విధించింది. కస్టమర్‌కు రూ.20 వేల పరిహారం చెల్లించాలని ఇండియా పోస్ట్‌ను ఆదేశించింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ చీరలు, బెడ్‌షీట్లు, షర్టులు, ప్యాంట్లు, మెడికల్ బుక్‌లు, ప్లాస్టిక్ కంటైనర్‌లతో కూడిన నాలుగు ప్యాకెట్లను గతేడాది ఇండియా పోస్ట్ ద్వారా హరిద్వార్‌కు పంపారు. అయితే వీకే సింగ్ పంపిన వస్తువులు ఆర్డర్ చేసిన చోటుకు వెళ్లే సరికి రూ.20 వేల విలువైన పది చీరలు మాయమయ్యాయి. తాను పంపిన నాలుగు ప్యాకెట్లను ఇండియా పోస్టు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తారుమారు చేశారని.. అందులోని వస్తువులను తీసుకున్నారని ఆరోపిస్తూ.. ఆయన జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.

వీకే సింగ్ ఫిర్యాదుతో జిల్లా వినియోదారుల ఫోరం విచారణ చేపట్టగా.. మొదటగా ఇండియా పోస్టు తోసిపుచ్చింది. తాము వస్తువులను సరిగ్గానే పంపించామని ఎలాంటి ట్యాంపరింగ్ చేయలేదంటూ పేర్కొంది. ఆయన వస్తువులు పంపే సమయంలో వాటి విలువను తెలియజేయలేదని.. వాటికి బీమా కూడా చేయలేదని వెల్లడించింది. అయితే, ఇండియా పోస్టు వాదనతో ఫిర్యాదుదారుడు వీకే సింగ్ విభేదించాడు. రవూఫ్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌లోని జీపీఓలోని ఇండియా పోస్ట్ ద్వారా నాలుగు ప్యాకెట్ల పంపించానని.. తాను పార్శిల్స్ పంపే సమయంలో వీడియో తీశానని.. డెలవరీ అయ్యాక కూడా వీడియో తీయించానంటూ వెల్లడించారు. ఆ రెండు వీడియోల్లో ఇండియా పోస్టు సిబ్బంది ట్యాంపరింగ్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆ వీడియోలను వినియోగదారుల ఫోరం కోర్టుకు అందజేయడంతోపాటు.. గతంలోనూ ఇలాంటి కేసులు నమోదయ్యాయని చెప్పారు.

ఫిర్యాదుదారుడి వాదనతో ఏకీభవించిన వినియోగదారుల ఫోరం వస్తువులు డెలవరీ చేసే సమయంలో అవి పోతే.. పోస్టల్ శాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నష్టానికి సంబంధిత పోస్టల్ శాఖ అధికారులే బాధ్యత వహించాలని పేర్కొన్న ధర్మాసనం.. రూ.20వేల పరిహారంతో పాటు, ఫిర్యాదు ఖర్చుల కోసం మరో 5,000 కూడా ఇవ్వాలని వినియోగదారుల ఫోరం పోస్టల్ శాఖను ఆదేశించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..