దీపావళి అంటే ప్రతి ఒక్కరి ఇంట దీపాల కాంతులు, స్వీట్లు, కొత్తబట్టలతో ఆనందంగా గడుపుతారు. కొందరు రకరకాల బాణా సంచాలను కాలుస్తూ ధ్వని కాలుష్యానికి గురిచేస్తారు. ఇలాంటి వారికి పోలీసు శాఖ కొన్ని కీలక సూచనలు జారీ చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో పబ్లిక్‌కి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొన్ని కీలక సూచనలు జారీ చేశారు. శాంతి భద్రతలతో పాటూ నగర ప్రజలకు ప్రశాంతతను కల్పించాలనే ఉద్దేశ్యంతో కొన్ని కీలక సూచనలు చేస్తున్నట్లు సందీప్ శాండిల్య తెలిపారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చట్టంలోని సెక్షన్ 67(సి) కింద తన విధులను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీపావళి పండుగ – 2023 వేడుకల సందర్భంగా బహిరంగ రహదారులతో పాటూ బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం నిషేధించబడిందని పేర్కొన్నారు. నగరంలోని ప్రజలకు సమాచారం అండించడం కోసం ప్రెస్‌నోట్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవల సుప్రీం కోర్ట్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ నిబంధనలు విధిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని బహిరంగ రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద శబ్దాలతో కూడిన పటాకులు పేల్చడం పూర్తిగా నిషేధించబడింది. దీపావళి సందర్భంగా రాత్రి 08:00 నుండి 10:00 గంటల మధ్య క్రాకర్స్, డ్రమ్స్, వాయిద్యాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించిన ధ్వని తీవ్రతకు మించి పెద్ద పెద్ద శబ్ధాలు చేయకూడదని వివరించారు. ఈ ఆంక్షలు నవంబర్ 12వ తేది ఉదయం 06:00 గంటల నుండి నవంబర్ 15వ తేది ఉదయం 06:00 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. పై ఉత్తర్వులను ఎవరైనా ఉల్లంఘిస్తే హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలకు తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ పోలీసు అధికారులు ఇచ్చిన సూచనలను పాటించి దీపావళి వేడుకలు జరుపుకోవాలని కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..