Hyderabad: ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డకు రూ.6లక్షలు.. వెలుగులోకి సంచలన నిజాలు..
అప్పుడప్పుడే లోకం చూస్తున్న శిశువుల్ని.. నిర్దాక్షిణ్యంగా అంగట్లో సరుకును చేస్తున్నారు మాయదారి కిలేడీ గ్యాంగ్‌లు. ఆడబిడ్డ అయితే ఓ రేటు.. మగబిడ్డ అయితే ఇంకోరేటు కట్టి అమ్మేస్తున్నారు. తల్లిదండ్రుల పాత్ర లేదు.. అధికారుల అనుమతి లేదు.. మా దారి అడ్డదారి అంటూ బిడ్డ బిడ్డకో రేటుగట్టి విక్రయిస్తున్నారు. అలాంటి ఓ ముఠాకు చెక్ పెట్టి.. నెట్‌వర్క్ మొత్తాన్ని లాగారు రాచకొండ పోలీసులు.

ఓ వందన.. ఇంకో సరోజిని.. మరో కృష్ణవేణి.. ఎవర్రా వీళ్లంతా అనుకుంటున్నారా..? వీళ్లంతా పసికందుల్ని అమ్మేసి సొమ్ము చేసుకుంటున్న కిలేడీలు..! గ్యాంగ్ అంతటికీ లీడర్ అమూల్య. ఓ స్టేట్‌లో శిశువుల్ని కొని ఇంకో స్టేట్‌లో విక్రయించడం అమూల్య బిజినెస్.. పేరుకు ఆశా వర్కర్.. చేసిది మాత్రం పిల్లలను అమ్మే బిజినెస్.. ఎక్కడికక్కడ బ్రోకర్లను అపాయింట్ చేసుకుని నెట్‌వర్క్‌ను అంతకంతకు విస్తరించింది. ఆ క్రమంలోనే రాచకొండ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది అమూల్య ముఠా… అమ్మ కడుపు నుంచి బయటికొచ్చి రోజులు కూడా గడవకముందే శిశువుల్ని అంగడి సరుకులు మార్చేస్తోందీ అమూల్య అండ్ కో. తల్లి ఒడిలో పెరగాల్సిన చిన్నారులను ఏకంగా రాష్ట్రాలు దాటించి అమ్మేస్తోంది. మొత్తం పదిమంది చిన్నారుల్ని రెస్క్యూ చేశారు రాచకొండ పోలీసులు. కాపాడిన వారిలో ఆరుగురు ఆడ, నలుగురు మగ శిశువులు ఉన్నారు. గుజరాత్, మహారాష్ట్రలో పిల్లలను కొని ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో అమ్ముతున్నారు.
చిన్నారులను రక్షించిన చైతన్యపురి పోలీసులు.. మధురానగర్లోని శిశు విహార్ కు తరలించారు. ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులేనని పోలీసులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు మధురానగర్లోని శిశు విహార సంరక్షణలో చిన్నారులను ఉంచనున్నారు. వారి తల్లిదండ్రుల ఆచూకీ తెలిసేంతవరకు వారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని, వారి బాగోగులు చూడాలని శిశు విహార్ అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించారు.. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశించారు.
9 మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సుధీర్ బాబు తెలిపారు. మొత్తం 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయని.. 16 మందిని రెస్క్యూ చేయగా.. ఇంకా 9 మందిని రెస్క్యూ చేయాల్సి ఉందని తెలిపారు.
ఆడబిడ్డకు రూ.4లక్షలు.. మగబిడ్డ అయితే రూ.6లక్షలకు విక్రయం
ఆడబిడ్డను రెండు లక్షలకు కొని నాలుగు లక్షలకు.. మగబిడ్డను నాలుగు లక్షలకు కొని ఆరు లక్షలకు విక్రయిస్తోంది అమూల్య గ్యాంగ్. మూడో కంటికి అనుమానం రాకుండా ఒక రాష్ట్రంలో పిల్లల్ని కొని.. ఇంకో రాష్ట్రంలో అమ్ముతూ చాలా తెలివిగా తప్పించుకుంటుంది.
ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న నెట్‌వర్క్ సభ్యులు
చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా కింగ్ పిన్ అమూల్య పాపం పండి నిన్న చిక్కింది. కానీ ఆ.. నెట్‌వర్క్‌కి చెందిన వాళ్లు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న.. అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలను అమ్ముతూ ఓ ముఠా చిక్కింది. వారిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. వందన, సావిత్రి కలిసి గుజరాత్, అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని హైదరాబాద్‌లో అమ్ముతున్నట్టు విచారణలో తేలింది. మరోవైపు ఏపీ, తెలంగాణలో కృష్ణవేణి, దీప్తి దళారులను ఏర్పాటు చేసుకుని పిల్లల్ని అమ్మేస్తున్నట్టు గుర్తించారు. ఉన్నత విద్యావంతులే పిల్లల్ని కొన్నారన్న విషయం తెలుసుకుని ఖాకీలు షాకయ్యారు.
మీడియేటర్లు జయశ్రీ, ఉమారాణి, కీర్తీ అరెస్ట్
ఫిబ్రవరి 27న మరో ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు రాచకొండ పోలీసులు. పిల్లల్ని విక్రయించడానికి మీడియేటర్‌గా పనిచేసిన జయశ్రీ, ఉమారాణి, కీర్తీని అరెస్ట్ చేశారు. కీలక నిందితురాలైన వందన కోసం రాచకొండ పోలీసులు గుజరాత్ వెళ్లారు. ఈ కేసులో మొత్తం 14మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపారు.
మార్చి 1న.. సరోజిని, ఫరీద, సైధభి, కరుణశ్రీ, శిరీష అరెస్ట్
మార్చి 1న.. పసిపిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న సరోజిని, ఫరీద, సైధభి, కరుణశ్రీ, శిరీషలను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పిల్లల్ని రెస్క్యూ చేశారు. నార్త్ ఇండియా నుంచి పిల్లల్ని కొని ఏపీలో అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు. సరోజినికి చాలా పెద్ద క్రిమినల్ హిస్టరీ ఉన్నట్టు గుర్తించారు. నిందితులపై జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.
మార్చి 7న అహ్మదాబాద్‌లో వందన అరెస్ట్
మార్చి 3న కిలాడి లేడీ సరోజిని గ్యాంగ్ విక్రయించిన శిశువులను విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక మార్చి 7న.. కీలక సూత్రధారి వందనను అహ్మదాబాద్‌లో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. సరోజిని వందన నుంచి అమూల్య దాకా ఇప్పటిదాకా ఎంతమంది పిల్లల్ని అమ్మేశారు..? సాంకేతిక ఆధారాలు.. నిందితుల ఫోన్లలోని సమాచారం అధారంగా మరింత కూపీ లాగుతున్నారు. నిందితులు శిశువుల్ని అమ్మేశాక బాండ్ పేపర్ల మీద ఒప్పందం చేసుకున్నారు. బాండ్ పేపర్ల తతంగంపైనా ఆరాతీస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..