
ఆ ఇంట్లో ఇటీవలే పెళ్లి జరిగింది. 10 రోజులు కూడా గడవకముందే.. కుటుంబ సభ్యులు అందరికీ వేశ్య కావాలంటూ ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. దీంతో టార్చర్ అనుభవించారు. భరించలేక ఒకసారి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. చివరి ప్రయత్నంగా సైబర్ క్రైమ్ పోలీసుల వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకున్నారు. పోలీసులు ఎంక్వైరీ చేయగా మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్ కాల్స్‌కు కారణం.. ఏపీలోని అనంతపురం పట్టణానికి చెందిన 34 ఏళ్ల వున్నూరు స్వామిగా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ స్వామి అనే వ్యక్తి యూసుఫ్‌గూడలో ఉంటున్నాడు. ఫంక్షన్స్ ఏవైనా ఉంటే.. క్యాటరింగ్ వాళ్లని పంపుతుంటాడు. ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తన ఫ్రెండ్ రిసెప్షన్‌కు క్యాటరింగ్ బాయ్స్‌ని పంపాలని కోరగా.. సరే అన్నాడు. ఒక్కొక్కరికి రూ.550 చొప్పున రూ.7150 మాట్లాడి.. డీల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత.. వారి నుంచి 15 వేలు డిమాండ్ చేశాడు. వారు ఎక్కువ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో స్వామి వేధింపులకు దిగాడు. బాధితుడితో పాటు పెళ్లి కొడుకు, ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాదు. బాధితుడి భార్య..పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఆమె ఫోటోలతో అసభ్య పోస్టులు పెట్టాడు. పబ్లిక్ టాయిలెట్స్, మెట్రో స్టేషన్ల వద్ద.. వేశ్య కావాలంటే ఈ నంబర్లకు కాల్ చేయాలంటూ.. వారి ఫోన్ నంబర్లు రాశాడు.
విపరీతంగా కాల్స్ రావడంతో వారంతా తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్లారు. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా.. నిందితుడి బండారం బయటపడింది. నిందితుడు ఇప్పటివరకూ 11 మందిని ఇలా వేధించాడని దర్యాప్తులో వెల్లడైంది. నేరం చేసిన తర్వాత సిమ్‌కార్డులు మారుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా 30 నంబర్లు మార్చినట్లు తెలిపారు. డీసీపీ ధార కవిత హైదరాబాద్‌లో కేసు వివరాలు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.