Hyderabad: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు పోలీసుల వార్నింగ్.. ఇకపై అలా చేస్తే తాటతీసుడే!

సిద్ధిపేట కమిషనరేట్ పరిధిలోని గజ్వేల్ పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల నమోదైన ఓహత్య కేసులో రంజిత్ పాండే అలియాస్‌ రంజిత్ రాయ్, రితేష్ కుమార్ రాయ్ లియాస్‌ రితేష్ రాయ్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నిందితులుగా తేలారు. వీరు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని కుతుబుల్లాపూర్‌లో పనిచేస్తున్న సంపద ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగులుగా ఉన్నట్లు..

Hyderabad: ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలకు పోలీసుల వార్నింగ్.. ఇకపై అలా చేస్తే తాటతీసుడే!
PSARA License in Hyderabad

Updated on: Jan 04, 2026 | 8:08 PM

హైదరాబాద్‌, జనవరి 4: సిద్ధిపేట కమిషనరేట్ పరిధిలోని గజ్వేల్ పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల నమోదైన ఓహత్య కేసుకి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పీఎస్‌ఏఆర్‌ఏ (PSARA) నియంత్రణాధికారి కీలక ప్రకటన వెలువరించారు. రంజిత్ పాండే అలియాస్‌ రంజిత్ రాయ్, రితేష్ కుమార్ రాయ్ లియాస్‌ రితేష్ రాయ్ అనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నిందితులుగా తేలారు. వీరు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని కుతుబుల్లాపూర్‌లో పనిచేస్తున్న సంపద ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగులుగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే సంబంధిత ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చెల్లుబాటు అయ్యే పీఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్ లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆ ఏజెన్సీ యజమానిపై FIR నెం. 1994/2025, సెక్షన్‌ 223 BNS, అలాగే PSAR చట్టం–2005 లోని సెక్షన్‌ 20 చదివి 22 ప్రకారం కేసు నమోదు చేసినట్లు నియంత్రణాధికారి తెలిపారు. అలాగే రాష్ట్రంలో పలు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు చెల్లుబాటు అయ్యే పీఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్ లేకుండానే సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లను నియమించి పనిచేస్తున్నట్లు కూడా గుర్తించినట్టు తెలిపారు.

PSAR చట్టం–2005 లోని సెక్షన్‌ 20 ప్రకారం పీఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్ లేకుండా సెక్యూరిటీ గార్డులు లేదా సూపర్వైజర్లను నియమిస్తే, ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ యజమానికి గరిష్ఠంగా ఏడాది వరకు జైలు శిక్ష లేదా రూ.25,000 వరకు జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. పీఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్ కోసం దరఖాస్తులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌ ద్వారా www.psara.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించాలని సూచించారు. పీఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్ పొందిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు కింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

  • పోలీసుల ద్వారా వ్యక్తిత్వం, గతచరిత్ర (వెరిఫికేషన్) పూర్తయిన అనంతరమే సెక్యూరిటీ గార్డులను నియమించాలి.
  • సెక్యూరిటీ గార్డుల ఆధార్‌/పాస్‌పోర్ట్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌/రేషన్‌ కార్డు వంటి గుర్తింపు పత్రాల వివరాలు సేకరించాలి.
  • 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు గల వారినే సెక్యూరిటీ గార్డులుగా నియమించాలి.
  • కనీసం రెండేళ్ల జైలు శిక్షకు గురయ్యే నేరాల్లో శిక్ష అనుభవించిన లేదా క్రిమినల్‌ చరిత్ర ఉన్నవారిని సెక్యూరిటీ గార్డులుగా నియమించరాదు.
  • పీఎస్‌ఏఆర్‌ఏ చట్టం ప్రకారం నిర్దేశిత శిక్షణను సెక్యూరిటీ గార్డులు తప్పనిసరిగా పొందాలి.

పీఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు తక్షణమే పీఎస్‌ఏఆర్‌ఏ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా లైసెన్స్ పొందాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల డైరెక్టర్‌/యజమాని/భాగస్వాములపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ అడిషనల్ డీజీపీ (ఇంటెలిజెన్స్) హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.